భారత్‌లో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ.. అలర్టయిన అధికారులు!

  • త్రిపురలోని పందుల ఫామ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ గుర్తింపు
  • పరిస్థితిని అంచనా వేస్తున్న ఒక నిపుణుల బృందం
  • ఫామ్ లో చనిపోయిన 63 పందులు
రకరకాల వైరస్ లు సమాజంపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. వరుసగా పంజా విసురుతున్న వైరస్ లతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మన దేశంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వెలుగుచూసింది. త్రిపుర రాష్ట్రంలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న దేవిపూర్ లో జంతు వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ఫామ్ లో ఈ కేసులను గుర్తించారు. 
ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను గుర్తించిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఒక నిపుణుల బృందం సదరు ఫామ్ ను సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను కూడా ఏర్పాటు చేసింది. ఫామ్ లోని పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో… అది ఫామ్ మొత్తం పాకి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు ఆఫ్రికన్ స్వైన్ నిర్ధారణ అయిన పందులన్నింటినీ చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. వీటిని 8 అడుగుల లోతైన గుంతలో పాతిపెట్టనున్నారు. ఆ షెడ్డులో 265 పందులు, 185 పంది పిల్లలు ఉన్నాయి. వీటిలో 63 పందులు గుర్తు తెలియని కారణాలతో చనిపోవడంతో… వాటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అని తేలింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking