బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
జూన్ 20న రాష్ట్ర వ్యాపిత ధర్నాలు
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. సిపిఎం నిర్మల్ జిల్లా కమిటీ సమావేశం ఈ రోజు ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై అయన మాట్లాడుతూ
దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాదుతుందని అన్నారు.నీట్ పై న్యాయ విచారణ జరపాలని ,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని
జూన్ 20న రాష్ట్ర వ్యాపిత ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.కొన్ని రోజులుగా నీట్ స్కాంపై అభ్యర్ధులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించినా పట్టించుకోని ప్రభుత్వం, చివరికి సుప్రీం కోర్టు కేంద్రానికి, నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)లకు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.అంతేతప్ప కుంభకోణంపై విచారణ జరిపిస్తామనికాని, అభ్యర్ధులకు ఏవిధమైన న్యాయం చేస్తామనికాని తెలపలేదు. నీట్‌లో అక్రమాలు అవేవో సాధారణంగా చోటు చేసుకున్న చిన్న తప్పులన్నట్లు పేర్కొన్నారుతప్ప కించిత్తు పశ్చాత్తాపం వ్యక్తీకరించలేదు. మంత్రి నుంచి ఇన్నాళ్లకు వెలువడిన పేలవమైన స్పందనబట్టి నీట్ స్కాంను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేందుకు తయారుగా ఉందని అర్థమవుతుంది.
నీట్‌లో అవకతవకలే జరగలేదని కేంద్రం చెబుతూ వచ్చింది. బిజెపి ఏలుబడిలోని గుజరాత్‌లో అవకతకలు జరిగాయని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా అక్రమాల పుట్ట పగిలినట్లయింది. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు. మరోవైపు ఎన్‌డిఎ పాలనలోని బీహార్‌లో ప్రత్యేకంగా సిట్‌ను వేసి దర్యాప్తు చేయిస్తున్నారు. ఇప్పటికి 13 మందిని అరెస్ట్ చేశారు. వారిలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారూ ఉన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే బిజెపి, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల కేంద్రంగా నీట్ స్కాం విస్తరించినట్లు అర్థమవుతోంది. గతంలో మధ్యప్రదేశ్‌లో శివ్‌రాజ్‌సింగ్ ప్రభుత్వంలో ఉద్యోగాల నియామకాల్లో జరిగిన వ్యాపం కుంభకోణం గుర్తుకొస్తోంది. కాగా కోర్టుల్లో విచారణ సందర్భంగా వెల్లడవుతున్న‘నీట్ అక్రమాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. 67 మంది అభ్యర్ధులకు 720 మార్కులొచ్చాయి. వారిలో హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన అరుగురు ఉన్నారు. ఒఎంఆర్ షీట్లలో ఒక విధంగా స్కోరింగ్ కార్డుల్లో మరొక విధంగా మార్కులొచ్చాయి. అనూహ్యమైన రీతిలో కటాఫ్ మార్కులు, సగటు మార్కులు పెరిగాయి.ఈ అక్రమాలు మచ్చుకు మాత్రమే. నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరిపిస్తే మరెన్నో అక్రమాలు వెలుగు చూడొచ్చు.
వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్‌ను 2019లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ప్రవేశపెట్టింది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో నీట్ సరైనది కాదని పలు రాష్ట్రాలు అభ్యంతరం పెట్టాయి. సామాజిక న్యాయానికి, అభ్యర్ధులకు, పేదలకు, గ్రామీణ విద్యార్థులకు నష్టమన్న ఆందోళనలు బలంగా వ్యక్తమయ్యాయి. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల దోపిడీకి అవకాశం ఇవ్వడమేనన్న విమర్శలూ వచ్చాయి. అయినా బిజెపి సర్కారు పెడచెవినపెట్టి తాను అనుకున్నది చేసింది. ఆచరణలో ఆ ఆందోళనలన్నీ నిజమయ్యాయి. ఎన్‌టిఎ పనితీరు లోపభూయిష్టంగా తయారైందని పేపర్‌లీక్, ఇతర అవకతవకలు, అక్రమాలు స్పష్టం చేస్తున్నాయి. మే 5న నిర్వహించిన నీట్ పరీక్షను 24 లక్షల మంది రాశారు. వారి భవిత అగమ్యగోచరం కావడం బాధాకరం. సుప్రీం,లేదా హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపిస్తేనే కుంభకోణం, దానితో సంబంధం ఉన్న వారి గుట్టు రట్టవుతుంది.కనీసం న్యాయస్థానం నియమించిన వారితోనైనా విచారణ జరిపిస్తే న్యాయం న్యాయం జరిగే వీలుంది. సిబిఐ అంటే, ఈ మధ్య కాలంలో ఆ సంస్థను మోడీ సర్కారు ఏ విధంగా ఆడిస్తున్నదీ చూస్తున్నాం.మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సర్వోన్నత న్యాయస్థానానికి నిజం చెప్పి సమగ్ర దర్యాప్తునకు ముందుకు రావడం బాధ్యత అనిపించుకుటుంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్,బొమ్మేన సురేష్,తొడసం శంబు లు,ఇతర జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.అభినందనలతో.సిపిఎం జిల్లా కమిటీ,నిర్మల్