ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం అర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ది చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు గురువారం కలెక్టర్ నగరంలోని 29వ వార్డు ప్రొ. జయశంకర్ పార్క్ ముదిగొండ మండలం ఖానాపురం నేలకొండపల్లి మండలం ఆరెగూడెం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన సభల్లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి పాల్గొన్నారు. సభ ఏర్పాట్లు, కౌంటర్లు స్వీకరించిన దరఖాస్తులు, ఏ ఏ పథకాలకు సంబంధించి దరఖాస్తుల్లో పేర్కొంటున్నది కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రశీదు తీసుకుంటున్నది లేనిది ప్రజలను అడిగి, రశీదు తప్పక తీసుకొని, భద్రపర్చుకోవాలని తెలిపారు. కౌంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులకు , ప్రజల నుండి వచ్చే దరఖాస్తుల్లో, అన్ని వివరాలు పొందుపర్చారా, వదిలిన వివరాలు అవసరం లేదని వదిలేశారా, పరిశీలించి తీసుకోవాలని, ప్రజల సందేహాలు నివృత్తి చేయాలని తెలిపారు. జిరాక్స్ తీసిన అప్లికేషను ఫారాలు పూరించి సమర్పించ వచ్చని తెలిపారు. సభల్లో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజా పాలన సభలు నిర్వహించేందుకు 62 బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం వార్డులు/గ్రామాల్లో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు వచ్చి దరఖాస్తులు సమర్పించాలని, దరఖాస్తు ఫారంలు ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నామని, దరఖాస్తుదారులు ముందస్తుగానే తమ దరఖాస్తును నింపి సభ వద్దకు రావాలని కలెక్టర్ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని , కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అన్ని పథకాలకు సంబంధించి కుటుంబం యూనిట్ గా ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సభ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసినట్లు, దరఖాస్తు నింపడంలో అధికారుల సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రజల దగ్గర ఉన్న ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులు సమర్పించాలని, ఆదాయం, కమ్యూనిటీ సర్టిఫికెట్లు అడగడం లేదని ఆయన అన్నారు. దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాల డాటా నమోదు చేసుకొని, ప్రభుత్వం పథకాల అమలులో అర్హులకు వర్తింపజేస్తామని ఆయన అన్నారు. అర్హుప్రజల వద్దకు పాలన తేవాలని, వారి వద్దకు వెళ్లి దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రజాపాలన సభ సమయంలో అందుబాటులో లేని వారు ఎటువంటి ఆందోళన చెందవద్దని, 6 జనవరి వరకు తమ దరఖాస్తులు వార్డ్, గ్రామ పంచాయతీల్లో అందజేయవచ్చని ఆయన అన్నారు. షెడ్యూల్ విషయమై ముందస్తు గా టాం టాం ద్వారా స్వచ్ఛ ఆటోలు, వాహనాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆయన తెలిపారు. అర్హులు ఒక్కరు మిగిలిపోకూడదని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా, చిత్తశుద్ధితో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఒక సువర్ణ అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, ఖమ్మం 29వ డివిజన్ కార్పొరేటర్ కె. సరిత, ఖమ్మం టౌన్ ఏసీపీ హరికృష్ణ, ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, ఖమ్మం మునిసిపల్ సహాయ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ముదిగొండ జెడ్పిటిసి దుర్గ, ఖానాపురం సర్పంచ్ ఉష, ఆరెగూడెం సర్పంచ్ రామకృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు