ఆరు గ్యారెంటీల అమలుకే దరఖాస్తుల స్వీకరణ.

 

సంగారెడ్డి లో ప్రజా పాలనకు శ్రీకారంచుట్టిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

పల్లెలు, వార్డులలో పకడ్బందీగా ప్రజాపాలన సభలు

భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు

ఆరు గ్యారంటీల అమలుకై దరఖాస్తుల స్వీకరణ

నిర్వహణ తీరును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న.

……రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ .

సంగారెడ్డి, డిసెంబర్ 28 ప్రజ బలం ప్రతినిది: డి అశోక్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లాలో గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో, చౌటుకూరు మండలం శివ్వం పేట, ఆందోల్ మండలం అల్మాయిపేట, సంగుపేట గ్రామాలలో అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే బాధ్యత ప్రభుత్వానిదని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా, అది అమల్లోకి తెచ్చే బాధ్యత యంత్రాంగానిదని మంత్రి పేర్కొన్నారు.
గతంలో ఇందిరమ్మ పేరిట ఏ విధంగా సేవలందించామో, అదేవిధంగా ఇప్పుడూ ప్రజలకు సేవలు అందిస్తామని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. వాటి అమలు కోసం ధరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అందరూ ధరఖాస్తులు నింపి కౌంటర్లలో అధికారులకు అందజేయాలన్నారు. వాటిని పరిశీలించి రాబోయే రోజుల్లో అర్హులకు న్యాయం చేకూరుస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చిందని, అర్హులకు ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు.
నేటి నుండి జనవరి 06 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, అర్హులైన వారందరు ఈ కార్యక్రమాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఈరోజు కార్యక్రమానికి హాజరుకాక, దరఖాస్తు చేసుకోలేని వారు మిగిలిన రోజులలో గ్రామపంచాయతీలో పంచాయతీ సెక్రటరీకి, వార్డులలో ఆయా అధికారులకు అందజేయవచ్చని తెలిపారు.
అనంతరం మంత్రి ధరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లను ప్రారంభించారు.
నేరుగా కౌంటర్ల వద్దకు వెళ్లిన మంత్రి మహిళల నుంచి ధరఖాస్తులను స్వీకరించారు.
జిల్లాలో నేటి నుండి జనవరి 06 వరకు (8 పని దినాలలో) కొనసాగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్ ను ఖరారు చేశారు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ, వారి సమస్యలను పరిష్కరించడం, అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూర్చడం, ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్ధిక సాధికారత చేకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రజాపాలన సభలకు ఏర్పాట్లు చేసింది.
మహిళలు, దివ్యాంగులకు ప్రతేక కౌంటర్లను ఏర్పాటు చేసారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుండి అధికార బృందాలు దరఖాస్తులు స్వీకరించాయి. స్వీకరించి, దరఖాస్తుదారులకు రశీదులు అందించారు.


దరఖాస్తులను ఎలా పూరించాలనే దానిపై అధికారులు సూచనలు చేయడంతో పాటు అంగన్వాడీలు, విద్యావంతులు, ఇతర సిబ్బంది ద్వారా దరఖాస్తులు పూరించడంలో సహాయ సహకారాలు అందించారు.
సభ ప్రారంభమైన వెంటనే అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అన్ని సభలలో ప్రత్యేకించి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన సభలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, రసీదులు అందజేత, ప్రజలకు అందుబాటులో ఉంచిన తాగు నీరు, షామియానాలు,కుర్చీలు వంటి వసతులను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా పకడ్బందీగా సభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.


ఆరు గ్యారంటీలలో భాగంగా గృహలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తులను అందించారు.
ఆయా సభలలో పాల్గొన్న మంత్రి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని మంత్రి కోరారు. సంక్షేమాన్ని కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. ఆయా సభలలో పలువురు మహిళలతో మంత్రి ముచ్చటించారు.
అల్మాయిపేట ప్రజా పాలన కార్యక్రమం సభలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
సంగారెడ్డి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఆర్డీఓ రవీంద్రారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, కమీషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చౌటుకూరు మండలం శివంపేట గ్రామ సభలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, జెడ్పి సీఈవో ఎల్లయ్య, మండల ప్రత్యేక అధికారి, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, ఆయా అధికారులు పాల్గొన్నారు.


ఆందోల్ మండలం
అల్మాయిపేట, సంగుపేట గ్రామ సభలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, సీఈఓ ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, గ్రామ సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking