ప్రజాపాలనలోని దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలి

తూంకుంట మున్సిపాలిటీలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదును ప్రత్యేకంగా పరిశీలించిన కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
ప్రజాపాలనలో వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆన్లైన్లో నమోదు చేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో చివరి రోజైన శనివారం తూంకుంట మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను, ఆన్లైన్లో నమోదు ప్రక్రియను కలెక్టర్ గౌతమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ల వద్ద ఉండి ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే ప్రజలు తీసుకొచ్చి దరఖాస్తులను ఎలా నింపారు ఎలాంటి పత్రాలు జత చేశారు తదితర వివరాలను ప్రజలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వచ్చే ఆరు పథకాల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న సభలలో వచ్చిన ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబరు 28వ తేదీ నుంచి శనివారం (ఈనెల 6వ తేదీ) వరకు నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీ ఆపరేటర్లు పరిశీలించి పూర్తి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు (ఎంట్రీ) చేయాలని కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్లతో పాటు దరఖాస్తుదారులు నింపిన సమాచారాన్ని ఆపరేటర్లు ఎంట్రీ చేసి అప్లోడ్ చేయాలని వివరించారు. ఈ దరఖాస్తులు ఈ నెల 6వ తేదీ (శనివారం) నుండి ఈనెల 17వ తేదీ లోగా దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అభయ హస్తం కింద దరఖాస్తులను ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో (షిఫ్టులలో) ప్రతిరోజు ఆపరేటర్ డేటాను ఎంట్రీ చేయాల్సి ఉంటుందని ఎంట్రీ చేసే సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ప్రతి దరఖాస్తు ఫారం ఆన్లైన్లో తప్పకుండా నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ గౌతమ్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించామని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో విజయవంతమైందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తూంకుంట మున్సిపల్ కమిషనర్ జైత్ రామ్నాయక్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking