‘సగుణ’ పద్ధతిలో పంటల సాగుపై అవగాహన

– సంప్రదాయ సాగుతో పర్యావరణానికి హాని
– సగుణ రూరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 3

కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో బుధవారం సగుణ పునరుత్పాదకత పద్ధతిలో అంటే..దుక్కి దున్నకుండా వరి, మొక్కజొన్న, పత్తి, ఇతర పంటల సాగు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సగుణ పునరుత్పాదకత వ్యవసాయ రూపకర్త, మహారాష్ట్ర సగుణ రూరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ హరి బడ్స్వాలే హాజరై మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో అవసరానికి మించి సాగు నీటిని వాడడం, కూలీల ఖర్చు, ఎరువులు మరియు పురుగు మందులను మోతాదుకు మించి వాడడం వల్ల నేలతో పాటు పర్యావరణానికి కూడా హాని కలగడం తో పాటు పెట్టుబడి ఖర్చు అధికంగా పెరుగుతుందని చెప్పారు. కావున పర్యావరణ హితంగా అధిక దిగుబడిని పొందే దిశగా 2011లో ఈ సగుణ పునరుత్పాదకత పద్ధతి (సగుణ రీజనరేటివ్ టెక్నాలజీ)ని రూపొందించినట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం ఆహార కొరత, వాతావరణ మార్పు ఈ రెండు సమస్యలను ఎదుర్కొంటుందని, వీటిని అధిగమించే దిశగా ఈ సగుణ పునరుత్పాదకత పద్ధతిని రూపొందించామని, ఇది ఒక కొత్త సాంకేతికత అని తెలిపారు. కరీంనగర్ ఏడిఆర్ డా.జి. శ్రీనివాస్ మాట్లాడుతూ నేలలో వుండే సేంద్రియ కర్బనం పంట దిగుబడికి చాలా కీలకం అని, అయితే ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయ సాగు లో మార్పు వలన అది క్షీణిస్తుందని వివరించారు. అలా జరిగితే భవిష్యత్తు లో పంట దిగుబడి తగ్గిపోయి ఆహార కొరత ఏర్పడుతుందని తెలిపారు. కావున రైతులు తమ వంతు బాధ్యతగా నేలలో సేంద్రియ కర్బనం ను పెంచడానికి సగుణ పునరుత్పాదకత పద్ధతి వంటి కొత్త సాగు విధానాలు అవలంభించాలని కోరారు. కేవికే ప్రధాన కార్యదర్శి పరిపాటి విజయ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలతో రైతులు సగుణ పునరుత్పాదకత పద్ధతి వంటి నూతన సాంకేతిక అంశాలపైన పరిజ్ఞానాన్ని పొంది సాగు లో వాటిని పాటించాలని కోరారు. కేవికే సీనియర్ సైంటిస్ట్ , హెడ్ డా. ఎస్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ఈ పద్ధతి సంప్రదాయ పద్ధతి కన్నా విభిన్నమైనది అని, నేలకు ఇది సానుకూలం గా ఉంటుందని, ఈ సాగు విధానం ద్వారా 30-40 శాతం నీటిని ఆదా చేయవచ్చని తెలిపారు. ఈ విధానం లో దున్నకుండా ఉండడం వల్ల నేలలో ఉన్న పాత పంట అవశేషాలు సేంద్రియ కర్బనం గా మారి కొత్త పంటకు పోషకాలుగా ఉపయోగపడతాయని వివరించారు. అలాగే కార్యక్రమానికి దుర్గా ప్రసాద్ గ్రామ బజార్, డా చేరాలు, రాంబాబు , ప్రియదర్శిని , చత్రు నాయక్ , శ్రీనివాస్ భూపాల్ రాజ్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking