ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి

 

జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బంది ఆసుపత్రుల్లో ఖచ్చితంగా సమయపాలన పాటించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాధికారులు, సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని, వారికి సేవ చేయడంలోనే ఎంతో సంతోషం ఉంటుందని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీఎం అండ్ హెచ్వో) అధికారి డాక్టర్ రఘునాథస్వామితో కలిసి వైద్యశాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఆరోగ్య శాఖకు సంబంధించి పీహెచ్సీలు, అర్భన్ హెల్త్ సెంటర్లు, బస్తి దవాఖాన లు, పల్లె దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి వైద్యం అందిస్తున్నారనే విషయాలను పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ వచ్చే రోగులు ఏఏ వ్యాధుల గురించి వస్తున్నారనే వివరాలను స్పష్టంగా తెలుసుకొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి మంచి వైద్యం అందుతుందనే నమ్మకంతో వస్తుంటారని వారిని ఇబ్బందులకు గురి చేయకుండా సరైన వైద్యం అందించాలని ఈ విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారితో పాటు కింది స్థాయి అధికారులు సైతం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. జిల్లాలోనిఆసుపత్రుల్లో వైద్యం సరిగ్గా అందడంలేదనే ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉందని ఫిర్యాదులు వచ్చినట్లయితే చర్యలు తీసుకుంటామని దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికీ మంచి వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. అలాగే పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు బస్తీదవాఖానాలు, పల్లె దవాఖానాల్లో సరిపడా సిబ్బంది ఉన్నారా? మందులు సరిగ్గా అందిస్తున్నారా? సిబ్బంది కొరత ఉందా? అనే వివరాలను కలెక్టర్ క్షుణ్ణంగా అడిగి తెలుసుకొన్నారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికితీసుకురావాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి సమస్యలు లేకుండా చూస్తామని కలెక్టర్ గౌతమ్ సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఆసుపత్రుల్లో ఏ రోజు చేపట్టాల్సిన పనులను ఆరోజు తప్పకుండా చేయాలని అందుబాటులో అన్ని రకాల మందులు ఉంచాలని ప్రస్తుతం లేనట్లయితే వెంటనే వాటిని తెప్పించుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఏఎన్ఎమ్లు వారు అందించే సేవలతో పాటు 108, ఆశ వర్కర్లు మెరుగైన వైద్యం అందించి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో మంచి వైద్యం అందించాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ ఆకాంక్షించారు.
ప్రోగ్రామ్ ఆఫీసర్లు బస్తీ దవాఖానాలకు సంబంధించి బాధ్యతలు తీసుకొని ప్రతిరోజూ వాటిని పర్యటించి వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. అలాగే డయాగ్నస్టిక్స్ కు సంబంధించి ఉన్న కేంద్రాల గురించి కలెక్టర్ గౌతమ్ తెలుసుకొన్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నార్మల్ డెలివరీల వివరాలను అడిగి తెలుసుకొని ప్రస్తుతం జరుగుతున్న డెలివరీలకంటే మరింత ఎక్కువ జరిగేలా అధికారులు, సిబ్బంది ప్రోత్సహించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. జిల్లాలో 108 అంబులెన్స్ సంఖ్య సరిపడా ఉందా? వాటి పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు.
జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది, డాక్టర్లు తప్పకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని అలా కాకుండా చూడాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ సూచించారు. జిల్లాలోని ఆసుప్రతుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. అలాగే వచ్చే వారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని. ఈ సమావేశానికి అధికారులందరూ పూర్తి సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని వైద్యాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో మంచి సేవలందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ గౌతమ్ సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథస్వామి, వైద్య శాఖ అధికారులు, వైద్యులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking