ఖమ్మం ప్రతినిధి జూన్ 22 (ప్రజాబలం) ఖమ్మం సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని ప్రభుత్వం తక్షణం ఉప సంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బొగ్గు వేలం పాటలను అడ్డుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కోరారు. ఇప్పటికే సింగరేణి సంస్థ రోజు రోజుకు కుచించుకుపోతున్నదని ఈ నేపథ్యంలో సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను వేలం వేస్తే మనుగడే ప్రమాదంలో పడుతుందన్నారు. కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు జాతి సంపదను కట్ట బెడుతుదని ప్రసాద్ ఆరోపించారు. గతంలో లక్షకు పైబడిన కార్మికులు కోట్లాది రూపాయల టర్నోవర్తో సిరుల తల్లిగా పేరొందిన సింగరేణి ఇప్పుడు బొగ్గు నిక్షేపాలు కరువై యాంత్రీకరణ పెరిగి కార్మికుల సంఖ్య గణనీయంగా -తగ్గిందని ఆయన తెలిపారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి విషయంలో అటు బిజెపికి మద్దతునిస్తూ ఇటు -వేలం పాటలకు పోకుండా అడ్డుకుని భవితవ్యాన్ని దెబ్బతీసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే కోయగూడెం ఉపరితల గనిని అరబిందో కంపెనీకి అప్పగించిందని సత్తుపల్లి ఓసిని మరో ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన బిజెపి ఇప్పుడు మరో మూడు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని సిపిఐ తీవ్రంగా నిరసిస్తుందన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం సిపిఐ నేతృత్వంలో కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేశారని, సింగరేణి పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్దం కావాలని సిపిఐ పిలుపు నిస్తుందన్నారు. సిపిఐ నేతృత్వంలో వేలం పాటలను ప్రైవేటు సంస్థలు బొగ్గు తీయడాన్ని -అడ్డుకుంటామని ప్రసాద్ స్పష్టం చేశారు. కార్మికులు, పార్టీ కార్యకర్తలు సింగరేణి పరిరక్షణకు ప్రతినబూనాలన్నారు.