కే.పీ.హెచ్.బి కాలనీలో పార్కులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు.

 

పార్కుల నిర్వహణ లోపించడంతో అధికారులపై ఆగ్రహం.

పార్కుల నిర్వహణ జిహెచ్ఎంసి చేపట్టాలని డిమాండ్

అసాంఘిక కార్యకలాపాలు నిలయంగా మారుతున్నాయని ఆవేదన.

(కూకట్‌పల్లి, ప్రజాబలం న్యూస్)
మే:25

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నెలకొన్న పలు పార్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం పరిశీలించారు. కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పార్కులను సందర్శించారు. పార్కుల నిర్వహణ, పార్కులలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా అవసరాల పేరుతో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవసరాలు లేనప్పటికీ గత ప్రభుత్వ నాయకులు ఖాళీ స్థలాలను కమిషన్ల కోసం పార్కులను నిర్మించారని ఆరోపించారు. నిర్మించిన పార్కుల నిర్వహణ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో జరగాలని, అయితే ఇక్కడ మాత్రం బి.ఆర్.ఎస్ నాయకులు పార్కులో తిష్ట వేసి సొంత జాగీరుగా వాడుకుంటున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక కే.పీ.హెచ్.బి ఎల్ఐజి ఫ్లాట్స్ ప్రాంతంలోని పార్కుల్లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వీటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి అంటే ప్రజాధనంతో నిర్మించి, పట్టించుకోకుండా ఉండడం కాదని విమర్శించారు. గత ప్రభుత్వం హయంలో పార్కుల అభివృద్ధి కోసమని కోట్ల రూపాయలు నిధులు కేటాయించి, టెండర్లు పిలిచి కమిషన్ల కోసం పనులు చేపట్టి నిర్వహణ బాధ్యత మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిహెచ్ఎంసి అధికారులు పార్కులను పరిశీలించి, ప్రజా అవసరాల కోసం వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ పార్కుల విషయాన్ని తాము జిహెచ్ఎంసి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శేరి సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కే.పీ.హెచ్.బి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రాజు, మహిళా అధ్యక్షురాలు పొన్నం రజిత గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, ఫణీంద్ర కుమార్, నాగమల్లేశ్వర రావు, బాబ్జి, నితీష్ కుమార్ గౌడ్, కిరణ్, సాయి తేజ గౌడ్, అరవింద్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking