గత పాలకుల వివక్షత వల్ల రోడ్ విస్తరణ ఆగిపోవడంతో పాటు వివాదాస్పదంగా మరిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 27 : మంచిర్యాల హమాలివాడ లో రహదారి విస్తరణ వివాదానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం తెరదించారు.గత కొద్దిరోజులుగా రోడ్ విస్తరణ విషయం లో పాక్షికంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల మధ్య వివాదం తలెత్తి విస్తరణకు ఆటంకంగా మారింది.వివాదం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రోడ్డు విస్తరణ దగ్గరకు వచ్చి బాధితులతో చర్చించారు.ఇండ్లు కోల్పోయిన,కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వపరంగా సాధ్యమైనంత మేరకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.55 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేస్తారని ఇండ్ల తొలగింపులో సొంత పార్టీ పరాయి వాళ్ళు అనే వివక్షత చూపనని స్పష్టం చేశారు. ఇప్పటికే 60 ఫీట్ల రోడ్ 55 ఫీట్లకు కుదించారని ఇంకా తగ్గించడం సాధ్యం కాదని తెలిపారు.రహదారి విస్తరణలో నష్టం జరుగుతున్నప్పటికి అభివృద్ధి కోసం త్యాగం చేయకతప్పదని అన్నారు. రోడ్ విస్తరణ పనులు నిలిపివేయడానికి కోర్టుకు వెళ్లిన ప్రయోజనం ఉండదని సూచించారు.గత పాలకుల వివక్షత వల్ల రోడ్ విస్తరణ ఆగిపోవడంతో పాటు వివాదాస్పదంగా మారిందని ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, ఇంజనీర్లు,కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.