బీఆర్ఎస్ ను ఆ దేవుడు కూడా రక్షించలేడు

పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు పీ.ఎల్.శ్రీనివాస్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించి, ఓడగొట్టినా పార్టీనాయకులు మాత్రం ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదని పార్టీ రాష్ట్ర నాయకుడు పీఎల్ శ్రీనివాస్ విమర్శించారు. తాము చేసిన తప్పులను ఇప్పటికీ తెలుసుకోలేని నాయకులు నడిపే బీఆర్ఎస్ పార్టీని ఇకపై ఆ దేవుడు కూడా రక్షించలేడన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చివరకు పార్టీని నడిపే అగ్ర నాయకులు కూడా ‘‘బీఆర్ఎస్ ను ఓడించడమే తెలంగాణ ప్రజలు చేసిన తప్పు’’ అని మాట్లాడుతున్నారని, ఆత్మవంచనతో ఉండలేకనే, పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఏ పార్టీలో చేరేదీ నా శ్రేయోభిలాషులతో చర్చించి, త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
• ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ కొందరు బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలతోనే పార్టీ ఓడిపోయింది. ఓటమికి ఒక్క కేసీఆర్ నే బాధ్యుడిని చేయడం మాత్రం సరైంది కాదు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన రోజే… పార్టీకి తెలంగాణతో ఉన్న పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తుంగలో తొక్కారు, ఉద్యమకారులను దూరంపెట్టి రాజకీయాలు చేశారు. అర్హత ఉన్న నాయకులను దూరంపెట్టి, అర్హతలేని వారికే పదవులిచ్చారు. కేసీఆర్ అవగాహన, ఆలోచనను కిందిస్థాయి నాయకులు అర్ధం చేసుకోలేదు. పార్టీ కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు దూరం చేసి ఈ పరిస్థితి తెచ్చారు. కేసీఆర్ ఎవరినైతే పూర్తిగా నమ్మారో, చివరకు వారే పార్టీకి ద్రోహం చేశారు’’ అని పీ.ఎల్.శ్రీనివాస్ దుయ్యబట్టారు.
‘‘ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అల్లాడుతున్నా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నా మనస్సును కలిచివేసింది. టీఎస్ పీఎస్సీలో జరిగిన అక్రమాలు, పేపర్ లీకులను అరికట్టలేకపోయారు. వేలాది ఎకరాల బీడు భూములు, కొండలు, గుట్టలకు కూడా రైతుబంధు ఇచ్చి, పేద కౌలు రైతులకు ఇవ్వకపోవడాన్ని రైతుబిడ్డగా నేను వ్యతిరేకించాను. ప్రజలను కలవకపోవడంతో క్రమంగా దూరమవుతున్నామని ముందే చెప్పాను. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు ’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ కొందరు బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రజలు సహించలేకపోయారు. చివరకు ప్రకృతి కన్నెర్రజేయడంతో కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందే రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరిగింది. దాన్ని గుర్తించి సరిచేసుకోకుండా, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ముందుగా మన ఇల్లు మనం చక్కదిద్దుకుంటే, ఈ పరిస్థితి ఉండేదే కాదు అన్ని తప్పులూ వారే చేసి, చివరకు ‘‘బీఆర్ఎస్ పార్టీని ఓడించడం.. తెలంగాణ ప్రజలు చేసిన తప్పే’’ అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.’’ అన్నారు.
‘‘బీసీ విద్యార్థి నాయకుడిగా 1980 నుంచే నేను రాజకీయాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో రాష్ర్రస్థాయిలో పనిచేసిన నేను తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాను. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎన్నో కరదీపికలు ప్రచురించాను. టీవీ చర్చల్లో పాల్గొన్నాను. పత్రికల్లో వ్యాసాలు రాశాను. ఒక బీసీ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ కోసం ఎన్నో పనులు చేసినా, పట్టించుకోలేదు. క్రియాశీలంగా పని చేసినా కార్యకర్తగానే ఉంచారు తప్ప, ఏ పదవీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ నా సేవలను వాడుకున్నదే తప్ప సరైన గుర్తింపు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీ నేతల్లో స్మశాన వైరాగ్యం అలుముకున్నది. అంతా సైలెంట్ అయ్యారు. మొదటినుంచీ రాజకీయాల్లో చురుగ్గా పనిచేసే తత్వం ఉన్న నేను, మౌనంగా బీఆర్ఎస్ లో ఉండలేకనే రాజీనామా చేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు, ఇంతకాలం నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు త్వరలోనే శ్రేయోభిలాషులతో సమావేశమవుతాను. వారందరి అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరబోయేదీ వెల్లడిస్తాను.’’ అని పీ.ఎల్.శ్రీనివాస్ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking