పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 19 (ప్రజాబలం) ఖమ్మం ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఓటరు అవగాహన 5కే రన్ ను పోలీస్ కమిషనర్, నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి, జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాoక్ బండ్ వరకు 5కే రన్ ను నిర్వహించారు. ఇట్టి రన్ లో యువత, కళాశాలల విద్యార్థులు, స్పోర్ట్స్, వాకర్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదైన ప్రతి ఓటరు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవాలని, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు I Vote for Sure అనే నినాదంతో 5కే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజున ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఇంట్లో, చుట్టుప్రక్కల ఉన్న వారు అందరూ విధిగా ఓటు హక్కు కలిగి, ఓటింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.
నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, ఓటు హక్కు ఉన్నది, లేనిది, పోలింగ్ కేంద్రం వివరాలు ఓటరు యాప్ ద్వారా తెలుసుకోవాలన్నారు. అవగాహన కు పంపిణీ చేసిన కరపత్రాల్లో కోడ్ స్కాన్ చేస్తే, ఓటరు యాప్ డౌన్లోడ్ అవుతుందని, ఓటు లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మొదటిసారి ఓటు వేసేవారు, ఇవిఎం డిమానస్ట్రేషన్ వాహనం ద్వారా ఏర్పాటు చేసిన ఓటింగ్ యంత్రాలతో ఓటు వేసే విధానంపై అవగాహన పొందాలన్నారు.
ఈ సందర్భంగా లకారం బండ్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో యువత పెద్ద ఎత్తున సంతకాలు చేశారు.
ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోనూ 5కె రన్ చేపట్టి, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో చైతన్యం తేవడంతో పాటు, యువత ఓటరుగా నమోదుకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, ఏసిపిలు గణేష్, సారంగపాని, ప్రసన్న కుమార్, నగర పాలక సంస్థ ఉప కమీషనర్ మల్లీశ్వరి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ అధికారులు తదితరులు పాల్గొన్నారు