‘ఇల్లందకుంట’ అభివృద్ధికి ఇంకెన్నాళ్లో?

– అపర భద్రాద్రిని మరింత అభివృద్ధి చేసేదెప్పుడు?
– అద్దె భవనాల్లో ఆఫీసులు..దృష్టి సారించాలని ప్రజల వేడుకోలు
– మండలం ఏర్పడి ఎనిమిదేండ్లు..ఆశించిన స్థాయిలో కనిపించని మౌలిక వసతులు
– ఇండస్ట్రీస్ ఏర్పాటుకు మండలకేంద్రంలో అనుకూల వాతావరణం

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 2

జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2016లో ఇల్లందకుంట మండలాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మండలం ఏర్పడి 8 ఏండ్లు గడుస్తున్నా మండల కేంద్రంతో పాటు సమీప పరిసరాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాలేదని జనం అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా ఉన్న వాతావరణాన్ని, వనరులను సద్వినియోగపరిచేలా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆ దిశగా ఫోకస్ చేయాలని కోరుతున్నారు.

ప్రజా సమస్యలు పక్కనపెట్టి..

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి తప్ప అభివృద్ధి పై మాత్రం అసలు దృష్టి సారించడం లేదు. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. కానీ, ఇరువురూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.

ఆచరణలో కాని పనులు?

ఇల్లందకుంట మండలకేంద్రం ‘మండలానికి తక్కువ గ్రామానికి ఎక్కువ’ అన్నట్టుగా ఉందని కొందరు అంటున్నారు. రాష్ట్రంలో ‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో ప్రభుత్వంలో మార్పు జరిగింది. కానీ, ప్రభుత్వ విధానాల్లో, అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో సర్కారు ఫోకస్‌లో మార్పు అయితే స్పష్టంగా కనబడటం లేదు.రాష్ట్రసర్కారు ఏర్పడి 6 నెలలు దాటుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపైన పనులయితే ప్రారంభం కాలేదు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో అయితే, అభివృద్ధిని పక్కనపెట్టి సాధారణ ఎన్నికలను మించిన స్థాయిలో నాయకులు పాలిటిక్స్ చేస్తున్నారు. ‘బూడిద’ రాజకీయం సవాళ్లు, ప్రతిసవాళ్లకు చేరుకొని, ఇక కథ ముగిసిందనుకునేలోపు మళ్లీ ఒకరి మీద మరొకరి విమర్శల పర్వం సాగుతోంది. స్థానిక శాసన సభ సభ్యుడు, మరో నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన వ్యక్తిపై అవినీతి చేశారనే విమర్శలు చేస్తున్నారు. దానికి కౌంటర్‌గా నియోజకవర్గ పరిధిలో నాయకులు, కార్యకర్తలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఆయా పార్టీల శ్రేణులు సైతం గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఇవన్నీ పక్కనపెట్టి స్థానిక యువత, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పన, నియోజకవర్గ అభివృద్ధిపైన, రైతుల శ్రేయస్సుకు ఏం చేయాలనే విషయాలపై నాయకులు ఫోకస్ చేయాలని విద్యాధికులు చెప్తున్నారు. ప్రభుత్వ ‘మార్పు’ వరకే ఆగిపోకుండా క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా గుణాత్మక మార్పు ఆచరణలో కనిపించే ఆయా పార్టీల నాయకులు తమ అధిష్ఠానం, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు.టూరిజంకు నెలవుగా ఇల్లందకుంట..

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది. చుట్టుపక్కలనున్న మండలాల, కరీంనగర్ జిల్లా ప్రజలు.. జమ్మికుంట పట్టణంలో వ్యాపారం నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే అపరభద్రాద్రి సీతారాముడి ఆశీస్సుల కోసం ఇల్లందకుంట రామాలయానికి వస్తుంటారు. అయితే, పాలకులు ఇల్లందకుంట మండల అభివృద్ధిపై మాత్రం దృష్టి సారించడం లేదు. మండలకేంద్రంలో పరిశ్రమను కానీ కేంద్ర పరిధిలోని ట్రిపుల్ ఐటీని కానీ మెడికల్ కాలేజీ లేదా ఇంజినీరింగ్ కాలేజీని కానీ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు అభివృద్ధికి కేరాఫ్‌గా ఇల్లందకుంట మారే అవకాశాలుంటాయి.

ఉపాధి కల్పనకు మార్గాలు..

చిన్న, మధ్య తరగతి పరిశ్రమను ఇల్లందకుంట మండలకేంద్రంలో ఏర్పాటు చేసినట్టయితే ప్రత్యక్షంగా కొంత మందికి లేదా పరోక్షంగానైనా 2 వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని విద్యావేత్తలు,సామాజికవేత్తలు కోరుతున్నారు. కానీ, పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఎంతసేపటికి స్వార్థ పూరిత చిల్లర రాజకీయమే తప్ప నలుగురికి ఉపాధి కల్పించి..యువతను ప్రయోజకులను చేసే దిశగా రాజకీయం ఉండటం లేదని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ బైపాస్ పూర్తయితే..రెండు జిల్లాకేంద్రాల మధ్యనున్న హుజూరాబాద్ నియోజకవర్గకేంద్రం, జమ్మికుంట పట్టణాన్ని పక్కనపెట్టి ప్రతిఒక్కరూ ఇల్లందకుంటలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇల్లందకుంట సమగ్ర అభివృద్ధికి నాయకులు తమ వంతు కృషిని చిత్తశుద్ధితో చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

స్థానికంగా ఉన్న చక్కటి వాతావరణం భూమి, నీరు వంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కనెక్టివిటీ కూడా ఇల్లందకుంటకు అడ్వాంటేజ్‌గానే ఉంటుంది. రోడ్డు, రైలు మార్గం ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా ఇక్కడికి చేరుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాష్ట్ర నలుమూలాల నుంచి ప్రజానీకం పుణ్యక్షేత్రమైన అపరభద్రాద్రిని దర్శించుకునేందుకు, పరిశ్రమలో ఉపాధి కోసం లేదా మెడికల్ కాలేజీలో చదువుల కోసం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా టూరిజం పరంగా కూడా డెవలప్‌మెంట్ జరుగుతుంది. హుజూరాబాద్ బైపాస్ రోడ్డు పూర్తయితే నియోజకవర్గకేంద్రమైన హుజూరాబాద్‌ను కూడా జనం పక్కనపెట్టి జమ్మికుంట, ఇల్లందకుంట వైపునకు తరలివచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఊహించని స్థాయిలో అతి తక్కువ సమయంలోనే ఇల్లందకుంట మండలంలో అభివృద్ధి జరగుతుంది. స్థానికంగా యువత, నిరుద్యోగులకు కొంత మేరకు ఉపాధి అవకాశాలూ లభిస్తాయి. ఈ దిశగా అధికారులు, ప్రభుత్వం ఆలోచన చేయాలని విద్యాధికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పరిశ్రమల ఏర్పాటుపై సర్కారు దృష్టి సారించాలి:
సబ్బని వెంకట్, సామాజికవేత్త, హెచ్‌సీఎల్, కంపెనీ సీనియర్ డైరెక్టర్

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి, ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తూ, ఒకరి మీద ఇంకొకరు నిందారోపణలు చేసుకుంటూ కాలయాపన చేయడం మానేసి, విస్తారమైన వనరులున్న ఇల్లందకుంట లేదా జమ్మికుంట మండలకేంద్రంలో ఏదో ఒక పరిశ్రమ, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుని సీఎంతో మాట్లాడాలి. తద్వారా స్థానికంగా యువతకు ప్రత్యక్ష, కొందరికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. మండలకేంద్రానికి కనెక్టివిటీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ప్రజలు అక్కడికి చేరుకోవచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి పరిశ్రమలో ఎంప్లాయ్‌మెంట్ లేదా కాలేజీలో చదువుల కోసం వచ్చే వారి ద్వారా వాణిజ్యపరంగా, దేవస్థానం సందర్శన ద్వారా పర్యాటక అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking