– కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
– యుద్ధ ప్రాతిపదికన 6 గ్యారంటీలను అమలు చేయాలని రాష్ట్రసర్కారుకు సూచన
– ప్రొఫెసర్ జయశంకర్, గూడ అంజన్నలకు ఘన నివాళి
-నాగర్ కర్నూల్ ఘటన సభ్యసమాజం సిగ్గుపడే చర్య
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 21
నాగర్ కర్నూలు జిల్లాలో నిరుపేద చెంచు మహిళపై జరిగిన దారుణమని, ఆ ఘటనపై సభ్యసమాజం సిగ్గు పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ అడ్డగోలు దందాలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న క్రిమినల్స్ పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. మహిళపై దారుణానికి ఒడిగట్టిన నీచుల పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరించాలని, తప్పు చేయాలనుకునే క్రిమినల్స్ గజగజ వణికేలా ఉక్కుపాదం మెపాలని కోరారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనవసర అంశాలను పక్కనపెట్టి ఎన్నికల హామీల అమలుపై చర్చించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం బండి సంజయ్ హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇల్లందకుంట దేవాలయాన్ని అన్ని విధాలా డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్, గూడ అంజన్న వర్ధంతి సందర్భంగా ఇరువురికి నివాళి అర్పిస్తూ వారి సేవలను స్మరించుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను ప్రజలు గెలిపించారని, ముఖ్యంగా హుజూరాబాద్‌లో కార్యకర్తలు కష్టపడి పనిచేసి భారీ మెజారిటీ అందించారని, ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తలందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానన్నారు. భారీ మెజారిటీతో గెలిపించాక కేంద్ర నాయకత్వం గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కార్యకర్తల కష్టానికి వచ్చిన గుర్తింపు ఇది అని, ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన పదవి ఇది అని తెలిపారు. కేంద్రం అప్పగించిన బాధ్యతలను తూ.చ. తప్పకుండా నిర్వహిస్తానన్నారు. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి యుద్ధ ప్రాతిపదిక గ్యారంటీల అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.