ఘనంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

 

కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి జూన్ 22

కరీంనగర్ జిల్లాకేంద్రంలోని భగత్ నగర్ లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీ పురిమల్ల శ్రీనివాస్, సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోగిరెడ్డి, సిపిఐ ఎంఎల్ నాయకుడు ప్రసాద్, తిమ్మాపూర్ మాజీ జెడ్పిటిసి జోగిరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య బసవ పున్నయ్య జాతీయ కార్యదర్శి ఆనందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం జరిగిన సభకు టీడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించారు. నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తనవంతు తోడ్పాటును అందిస్తానని పేర్కొన్నారు. 1987 నుంచి విద్యార్థి నాయకుడిగా ఉన్న తనకు పత్రికల విలువ తెలుసని చెప్పారు. తాను ప్రతిరోజు పది పత్రికలు తప్పకుండా చదువుతానని వెల్లడించారు. పత్రికలు చదివే వారి సంఖ్య రోజుకు తగ్గడం దురదృష్టకరమని చెప్పారు. పత్రికా పఠనం వైపు సమాజం మొగ్గు చూపేలా పాత్రికేయులు చక్కటి కథనాలను అందించాలని సూచించారు. ప్రజలకు దిక్సూచిగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ఉండాలని ఆశ బాగుంది చేశారు. ప్రెస్ క్లబ్ తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని నొక్కి చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయమై కూడా చొరవ తీసుకుంటానని, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రభుత్వ స్థలంలో ఇండ్ల స్థలాల పంపిణీకి సహకారం అందిస్తానని వెల్లడించారు.

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగిరెడ్డి మాట్లాడుతూ విలేకరులు ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. ఏదైనా సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఫాలో అప్ కథనాలను అందించాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యపు రెండో పిల్లర్ గా జర్నలిజం వ్యవస్థ ఉంటుందని వివరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల తరఫున సంఘటిత ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అక్షరమే ఆయుధంగా రాజీ పడకుండా రాజీ లేనివిధంగా సమసమాజ స్థాపనకు తమ వంతు పాత్రకు బాధ్యతాయుతంగా పాత్రికేయులు పోషించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ చార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతరాత్మ సాక్షిగా నాణ్యత ఉండే విధంగా కథనాలను పాత్రికేయుడు రచించాలని సూచించారు. దమ్ము ధైర్యం ఉన్న జర్నలిస్టులకు సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. క్లబ్ ప్రారంభోత్సవంలో కరీంనగర్ జిల్లా పరిధిలోని జర్నలిస్టులు, హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking