కుటుంబ నియంత్రణలో భారత్ ప్రస్థానం: మరపురాని ఉదాహరణలు… మన ముందున్న సవాళ్ల గుర్తింపు

రచన: శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర ఆరోగ్య-కుటుంబ
సంక్షేమ; రసాయనాలు-ఎరువుల శాఖల మంత్రి

ఈ ఏడాది (జూలై 11న) ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కుటుంబ నియంత్రణలో భారత్ అద్భుత ప్రస్థానాన్ని మనం ఓసారి గుర్తుచేసుకుందాం. మన విజయాలపై ఒకవైపు గర్విస్తూ, మరోవైపు ఆశావహ భవిష్యత్తు లక్ష్యంగా ముందున్న సవాళ్ల పరిష్కారంపై చిత్తశుద్ధిని పునరుద్ఘాటిద్దాం.
భారత మార్గనిర్దేశం… పురోగమనం
ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అభివృద్ధిపై 2024 మే నెలలో 30వ అంతర్జాతీయ సదస్సు (ఐపిసిడి) నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా భారత్ ‘ఐపిసిడి’ నిర్దేశిత కార్యక్రమాల అమలుకు పటిష్ట మార్గనిర్దేశం చేసింది. అలాగే క్షేత్రస్థాయిలో మెరుగైన కుటుంబ నియంత్రణ సేవలు, ప్రజారోగ్యం… ముఖ్యంగా మాతాశిశు సంక్షేమంపై సంపూర్ణ కార్యాచరణతో అద్భుత ఫలితాలు సాధించి చూపింది.
జనసంఖ్య సంబంధ మార్పులపై చురుకైన ప్రతిస్పందన
భారతదేశంలో ఆధునిక (1980-90 దశకాల మధ్య జన్మించిన) యుగం మహిళలు ‘చిన్న కుటుంబమే చింతల్లేనిది’గా భావిస్తూ, ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటూ వచ్చారు. ముఖ్యంగా గత దశాబ్దంలో ఈ ధోరణి గణనీయంగా మారడంతో, పునరుత్పత్తి (15-49 ఏళ్ల మధ్య) వయస్కులైన మహిళల్లో సగానికిపైగా (57 శాతం) ఆధునిక గర్భనిరోధక పద్ధతులను చురుగ్గా పాటిస్తున్నారు. ఇలాంటి గర్భనిరోధక సాధనాల విస్తృత వినియోగమే కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భారత్ విజయానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే, కుటుంబ నియంత్రణ అన్నది కేవలం గర్భనిరోధానికి మాత్రమే పరిమితం కాలేదు; మహిళలు, కుటుంబాలు… మొత్తంగా సామాజిక ఆరోగ్యం-శ్రేయస్సులో ఇదొక అంతర్భాగంగా మారింది. అంతేగాక మహిళలు, బాలికలు, యువతరానికి హక్కులు, ఆకాంక్షలను ఎంచుకునే సముచిత స్వేచ్ఛను, సాధికారతను ప్రసాదించింది. కాబట్టే, భారత్ నేడు 10-24 ఏళ్ల మధ్య వయసున్న 369 మిలియన్ల యువతరంతో పరివర్తనాత్మక జనసంఖ్య దిశగా ముందడుగు వేస్తూ వికసిత భారత్ స్వప్న సాకారానికి సన్నద్ధమైంది.
అంతేకాకుండా దశాబ్దాల సుదీర్ఘ కాలంలో కుటుంబ నియంత్రణలో భిన్న విధానాల అనుసరణ ద్వారా ఈ కార్యక్రమం గణనీయ పరిణామశీలతను నమోదు చేసింది. ఈ మేరకు వైద్యకేంద్రాలపై ఆధారపడే పరిస్థితుల నుంచి నిర్దిష్ట లక్ష్యం ప్రాతిపదికగల పద్ధతుల ద్వారా ఇవాళ స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణను ఎంచుకునే స్థాయికి చేరింది. జనాభా పరంగా మారుతున్న అవసరాలకు తగినట్లు విధానానుసరణను ఈ వైవిధ్యం స్పష్టం సూచిస్తుంది.
అదేవిధంగా కుటుంబ నియంత్రణ పాటించడంలోగల కొద్దిపాటి అంతరం తొలగింపు ఆవశ్యకతను జాతీయ జనాభా-ఆరోగ్య విధానాలు నొక్కిచెప్పాయి. ఆ మేరకు సంతానం వద్దనుకునే లేదా గర్భధారణను వాయిదా వేసే మహిళల్లో ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను పాటించని వారి శాతాన్ని ప్రస్ఫుటం చేశాయి. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ-2020, ప్రస్తుతం కు.ని-2030 కార్యక్రమాలకుగల అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ‘‘పునరుత్పత్తి-ప్రసూతి-శిశు-కౌమార బాలల ఆరోగ్యం’ (ఆఎంఎన్‌సిహెచ్‌+ఎ) విధానాన్ని ప్రభుత్వం సంస్థాగతీకరించింది. దీంతో 2012 నాటికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఈ విధంగా అవగాహన పెంపు, సామాజిక భాగస్వామ్యానికి ప్రోత్సాహం, సమాచారం-సేవా ప్రదానం మెరుగు, గర్భనిరోధక సాధనాల ఎంపిక పరిధి విస్తృతి, మారుమూల వరకూ నాణ్యమైన సేవలకు భరోసా, సంతానోత్పత్తి శాతం అధికంగాగల ప్రాంతాల్లో వినూత్న వ్యూహాల అమలు వంటి చర్యలపై నిశితంగా దృష్టి సారించింది.
ఏ దేశంలోనైనా ప్రగతి-వృద్ధి జనసంఖ్య సంబంధిత అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ మేరకు జాతీయంగా, ప్రాంతీయంగా సంతానోత్పత్తి లోటు భర్తీ-స్థాయుల నిర్వహణలో లక్ష్య సాధన ముఖ్యం. దీనికి అనుగుణంగా భారత్ ఇప్పటికే జాతీయ స్థాయిలో (మొత్తం సంతానోత్పత్తి రేటు 2.0) సంతానోత్పత్తి స్థాయిని భర్తీ చేసింది. అలాగే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్‌-5; 2019-21) ప్రకారం- దేశంలోని 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మైలురాయిని అందుకుని, విజయ ప్రస్థానానికి తమవంతు ఊపునిచ్చాయి.
మరోవైపు కుటుంబ నియంత్రణతో మాతాశిశు అనారోగ్య-మరణాల తగ్గింపు కూడా సాధ్యం కాగలదన్న వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. దీనిపై నిశితంగా దృష్టి సారించడం కూడా ఈ కార్యక్రమంలో మరో కీలకాంశమని తేలడం విధాన లక్ష్యాల సమగ్ర విస్తరణకు దోహదం చేసింది.
భారతదేశంలోని రాష్ట్రాల్లో జన వైవిధ్యం ప్రపంచంలోనే విశిష్టమైనది కావడంతో తదనుగుణంగా వ్యూహాల రూపకల్పన-అమలు సాగింది. అలాగే గర్భనిరోధక పద్ధతుల ఎంపికలో విస్తృతితోపాటు వివాహ-తొలి సంతాన సాఫల్య వయసు, బాలికల విద్యాభ్యాసం తదితర సామాజికాంశాలు కూడా ఈ వ్యూహంలో కీలకమైనవి. దేశానికిగల విభిన్న అవసరాలను తీర్చే సమగ్ర కుటుంబ నియంత్రణ విధాన రూపకల్పనలో ఈ అంశాలకెంతో ప్రాధాన్యం లభించింది.
కుటుంబ ప్రగతి కార్యక్రమం (ఎంపివి)… పరివర్తనాత్మక కుటుంబ నియంత్రణ
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్లో ఒకటైన కుటుంబ ప్రగతి కార్యక్రమం (ఎంపివి) 2016లో ప్రారంభమైంది. సంతానోత్పత్తి సామర్థ్యం అధికంగాగల ఏడు (బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అస్సాం) రాష్ట్రాల్లోని 146 జిల్లాల్లో గర్భనిరోధక సాధనాల లభ్యత, కుటుంబ నియంత్రణ సేవల ప్రదానం పెంపు దీని లక్ష్యం.
దీనికింద యువతులకు గర్భనిరోధక సాధనాల సౌలభ్యంలోగల సామాజిక అవరోధాల తొలగింపు నిమిత్తం సంచార అవగాహన పెంపు వాహనాలు (అవేర్‌నెస్-ఆన్ వీల్స్), అత్తాకోడళ్ల సదస్సులు వగైరా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధమైన విస్తృత ప్రచారంతో కుటుంబ నియంత్రణ సేవల ప్రదానంలో పరివర్తనాత్మక విధానాలను అమలు చేశారు. ఇందులో భాగంగా నవ దంపతులకు ‘నయీ పహెల్’ పేరిట కుటుంబ నియంత్రణ-బాధ్యతాయుత తల్లిదండ్రులుగా మెలిగే పద్ధతులపై అవగాహన కల్పించే సరంజామాను అందజేశారు. అంతేకాకుండా పటిష్ట కుటుంబ నియంత్రణ సదుపాయాల నిర్వహణ సమాచార వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు, గర్భనిరోధక సాధనాల నిరంతర సరఫరాలో ప్రజారోగ్య వ్యవస్థ చురుగ్గా కృషి చేసింది.
ఈ కార్యక్రమం అమలు చేసిన జిల్లాల్లో ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం గణనీయంగా/వేగంగా మెరుగుపడటం ‘ఎంపివి’ లక్ష్యాల సానుకూల ప్రభావాన్ని ప్రస్ఫుటం చేసింది. ఈ సానుకూల ఫలితాలిచ్చిన ప్రోత్సాహంతో 7 రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలతోపాటు 6 ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం 2021లో నిర్ణయించింది.
జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం కింద సాధనాల ఎంపికలో విస్తృతి:
పెరుగుతున్న జన సంఖ్య, మారుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా 2016-17లో గర్భనిరోధక సాధనాల సంఖ్యను ప్రభుత్వం విస్తృతం చేసింది. ఈ మేరకు జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం కింద నేడు కండోమ్‌లు, గర్భాశయ గర్భనిరోధక పరికరాలు, నోటిద్వారా తీసుకునే మాత్రలు, ‘ఎంపిఎ’ ఇంజెక్షన్లు వంటి అనేకరకాల దీర్ఘకాలిక అధునాతన గర్భనిరోధక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా 10 రాష్ట్రాల్లోని రెండేసి జిల్లాల వంతున కార్యక్రమం అమలు చేయబడింది. ఇక చర్మం కింద అమర్చే గర్భనిరోధకాలు, చర్మంలోకి ఇచ్చే ఇంజెక్షన్ల (చర్మాంతర ఉపకరణాలు) వినియోగం ప్రారంభ దశలో ఉంది. వీటి వినియోగాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
కార్యాచరణకు పిలుపు
ప్రపంచ జనాభా దినోత్సవం-2024 నేపథ్యంలో మనం ఇవాళ ‘‘తల్లీబిడ్డల ఆరోగ్యం-శ్రేయస్సు దిశగా ఆరోగ్యకర గర్భధారణ-పిల్లల మధ్య తగిన వ్యవధి’’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లోని ‘ఎఎన్ఎం’లు, ‘ఆశా’ కార్యకర్తలు సహా మన క్షేత్రస్థాయి ప్రజారోగ్య పరిరక్షణ సిబ్బంది అంకితభావాన్ని మనం ప్రశంసించాలి. మారుమూల ప్రాంతాలకూ కీలక సమాచారం చేరవేత, సేవల ప్రదానంలో ముందువరుసన ఉన్న వీరి అవిరళ కృషిని కార్యక్రమ విజయానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రపంచ యువతరంలోని యుక్తవయస్కులు, మహిళలు, బాలలు మన దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. ప్రజారోగ్యం, శ్రేయస్సుపై కాలం, నిధులు వెచ్చించాల్సిన కీలక అవసరాన్ని ప్రస్ఫుటం చేస్తూ, జనసంఖ్య లబ్ధికి వీరంతా ప్రత్యేక కానుకగా నిలుస్తున్నారు.
ఈ మేరకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు, విస్తృత శ్రేణి గర్భనిరోధక సాధనాల లభ్యత ఎంతో కీలకం. తదనుగుణంగా సౌలభ్యానికిగల అవరోధాలతోపాటు గర్భనిరోధక పద్ధతులపై అపోహల తొలగింపు అవశ్యం. అలాగే వినియోగదారులలో అవగాహన లేమి, భౌగోళిక-ఆర్థిక సమస్యలు, సామాజిక నిర్బంధాలు, సాంస్కృతిక నియమాలు వగైరాలను అధిగమించేలా తనవంతు కృషికి ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ సేవల ప్రదానం మెరుగు, తాత్కాలిక- దీర్ఘకాలిక గర్భనిరోధక విధానాల సౌలభ్యం, అన్నిటికీ సరిపడా బడ్జెట్ కేటాయింపులు, ఆస్పత్రుల వంటి ఆరోగ్య మౌలిక సదుపాయాల వద్ద సామాజిక కార్యకర్తలతో నిరంతరాయ సేవల ప్రదానం వంటివి సహా అన్నిటిమీదా గణనీయ స్థాయిలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. మరోవైపు
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల కుటుంబ నియంత్రణ సేవలను మారుమూలకూ విస్తరింపజేస్తోంది. డిజిటల్ ప్రపంచం వేగంగా దూసుకెళ్తున్న దృష్ట్యా సమాచారం-సేవలకు లభ్యత పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తోంది. ఆ మేరకు అన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించి, విస్తృతిని పెంచగల అవకాశాలను సమర్థంగా వాడుకోవడంపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది. ఏదేమైనా కుటుంబ నియంత్రణలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు భాగస్వాములందరి సహకారం-అంకితభావం అవశ్యం. ముఖ్యంగా గర్భనిరోధక పద్ధతుల పరిధి విస్తరణ ద్వారా మన యువత పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో అవసరం. అలాగే భారత జనసంఖ్య లబ్ధి సుస్థిర ప్రగతి, పట్టణీకరణ, వలసల సంక్లిష్టతలను అధిగమించగలగాలి. ఈ అంశాలన్నిటినీ మన విధానాలలో అంతర్భాగం చేయడం ద్వారా జనాభా వృద్ధి మనకు సుస్థిర భవిష్యత్తుగా, సమాజంలోని అన్నివర్గాల సమ్మిళిత శ్రేయస్సుగా మారుతుంది.
విజయవంతమైన లక్ష్యాల దిశగా చేపట్టే చర్యల ఫలితాలు సముచిత వ్యూహాలతో కూడినవై ఉండాలి. అలాగే ముందడుగు దిశగా ఆశావహ వృద్ధికి చక్కని బాటలు పరచడంలో ఎదురయ్యే లోటుపాట్లను పరిష్కరించాలి.
మొత్తంమీద ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అట్టడుగు-బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టితో అందరికీ ఉజ్వల, ఆరోగ్యకర భవిష్యత్తును నిర్మించే దిశగా ప్రతినబూనుదాం. మన జనంసఖ్య లబ్ధిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ పౌరులలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం కలిగేలా చూడాలి. ఆ మేరకు మన దేశ ప్రగతి, సుసంపన్న భవితకు పునాది వేయగల మన ప్రజారోగ్యం-శ్రేయస్సు కోసం కృషి చేద్దాం.

మనందరి సమష్టి కృషితోనే ఈ స్వప్నాన్ని సాకారం చేసుకోగలం!

Leave A Reply

Your email address will not be published.

Breaking