ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 21 : మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాలలో ముందుంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి సందర్శించి కార్యాలయంలోని వివిధ విభాగాలు,ప్రజా పాలన కౌంటర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాలలో ముందు ఉంచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.వర్షాకాలం అయినందున మున్సిపల్ పరిధిలోని వార్డులలో శుభ్రమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని,అన్ని వార్డులలో వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలని తెలిపారు.వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడడంతో పాటు వార్డులలోని అంతర్గత రహదారులు,మురుగు కాలువలలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు.పారిశుధ్య నిర్వహణలో భాగంగా డ్రైడే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆహారం, త్రాగునీటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రావుల ఉప్పలయ్య,మున్సిపల్ అధికారులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.