ఆరు గ్యారంటీల పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు

మేడ్చల్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీల పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిధిలోని మేడ్చల్ మండలంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మేడ్చల్ మండంలోని 7, 23 వార్డులు, గౌడవెల్లి గ్రామాల్లో ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్న గ్రామసభను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ… జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రజాపాలన ఆరు గ్యారంటీల ఫలాలను అందించేందుకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలవారీగా పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ 2024 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దరఖాస్తుదారులు ముందస్తుగానే సంబంధిత రీసోర్స్ పర్సన్లు, సిబ్బంది అందచేసిన దరఖాస్తులను పూరించి (నింపి) దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లలో అందించాలని, దరఖాస్తుదారులు నిజమైన సమాచారాన్ని ఫారమ్లో పొందుపర్పాలని, తద్వారా అర్హత గల లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ గౌతమ్ వివరించారు. ఈ సందర్భంగా మొదటిరోజైన గురువారం ప్రజాపాలన లో ఎన్ని దరఖాస్తులు స్వీకరించారు అలాగే శుక్రవారం ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్వీకరించే దరఖాస్తులకు అవసరమైన ఆధార్కార్డులు, రేషన్ కార్డులు, ఫొటోలు తదితరాలు జత చేశారా అనే విషయాన్ని సంబంధిత అధికారులు, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం స్వీకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వంద మంది కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మరో కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలని ఈ విషయంలో సంబంధిత ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా వివరించారు. ప్రజాపాలన గ్రామసభలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఏమాత్రం పొరపాట్లు చోటు చేసుకున్నా ప్రజలకు ప్రభుత్వ పథకాలు దూరమవుతాయని దీనిని దృష్టిలో పెట్టుకోవాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు, సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కొందరు దరఖాస్తుదారులు కొన్ని సందేహాలను జిల్లా కలెక్టర్ గౌతమ్ దృష్టికి తీసుకురాగా వారి సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking