ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది మంత్రి పొంగులేటి

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 10 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మంత్రి, ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు, ఏదులాపురం, కొండాపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చామని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీ లు అమలుచేసామని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి వారి కష్టాలు తెలుసుకున్నారన్నారు. హామీల అమలుకు కార్యాచరణకు అధికార యంత్రాంగం ప్రజల గుమ్మం వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించారన్నారు. దరఖాస్తుల్లో ఇచ్చిన ప్రజల కోరికలను పేదవారిలో అతి పేదవారి నుంచి మొదలుకుని అర్హులైన వారందరికీ అందిస్తామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపి, ఇచ్చిన హామీల నుండి తప్పించుకునే ప్రభుత్వం కాదు ఇందిరమ్మ ప్రభుత్వమని తెలిపారు. ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో 56 ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో భవనానికి రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టామన్నారు. పేద ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ చంద్రమౌళి, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, మిషన్ భగీరథ ఇఇ లు పుష్పలత, వాణిశ్రీ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, వైద్యాధికారులు డా. సైదులు, డా. శ్రీదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking