* కాంగ్రెస్ నాయకుడు పొనగంటి మల్లయ్య విమర్శ
జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి, జూన్ 27:
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు భూ అక్రమణలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య ఆరోపించారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు మొత్తం దొంగలని,రౌడీలని ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలోని మహిళా మండలి స్థలాన్ని కౌశిక్ అనుచరుడు కబ్జా చేసి, అందులో భవన నిర్మాణం చేసిన మాట వాస్తవం కాదా? అని అడిగారు. మహిళా మండలికి చెందాల్సిన భూమిని ఎమ్మెల్యే అనుచరుడు అధికారం ఉందని,అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక సర్వే నంబర్ లో హౌస్ పర్మిషన్ తీసుకుని,పక్కన ఉన్న మహిళా మండలి స్థలంలో అక్రమ నిర్మాణం చేశారని ఆరోపించారు. 642 సర్వే నంబర్ లోని భూమిని, 652లో ఉన్నట్టుగా ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఈ కబ్జా పై స్థానిక మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీ లో ఇన్ని సంవత్సరాల నుండి దొంగ బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దండుకున్న నీ అనుచరులకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు. కౌశిక్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు తీసుకొని నిరుద్యోగుల కడుపుకొట్టిన విషయానికి సంబంధించి ఆధారాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయని, నిరుద్యోగుల నుండి నువ్వు డబ్బులు తీసుకున్నది వాస్తవం అవునో కాదో చెల్పూర్ గుడికి వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్ ఇన్ చార్జి ప్రణవ్ సవాల్ చేయగా, పోలీసులు అడ్డుకొని రానివ్వలేదని కౌశిక్ చెప్పారని తెలిపారు. ఇకపై కౌశిక్ రెడ్డి లాంటి రాజకీయ అజ్ఞానిని తాము పట్టించుకోబోమని వెల్లడించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,ఆయన అనుచరులు అంతా రౌడీ బ్యాచ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వెనుక ఉన్న చిల్లర బ్యాచ్ అంతా భూ కబ్జాలు, భూ పంచాయతీ పేరా తుపాకులతో బెదిరింపులకు పాల్పడే రౌడీ గ్యాంగ్ అని జమ్మికుంట కాంగ్రెస్ నాయకుడు దేశిని కోటి అన్నారు. గత కొంత కాలంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆధారాలు లేని అసత్య అవినీతి ఆరోపణలు చేస్తూ..ఫ్రీ పబ్లిసిటీ కోసం కౌశిక్ రెడ్డి ఆరాటపడుతున్నారని కోటి ఆరోపించారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా మంత్రి పొన్నం అడ్డుతగులుతున్నాడని ఆయన అవినీతి ఆరోపణలు చేస్తూ,ఒట్లు దేవుళ్లపై ప్రమాణాలు అనే నాటకాలాడుతూ పొన్నంని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్న కౌశిక్ రెడ్డి కి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని కోటి హెచ్చరించారు.ఇసుక ట్రాక్టర్ యజమానుల నుండి, జమ్మికుంట వ్యాపారుల నుండి నువ్వు డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కౌశిక్ తన పుట్టినరోజు కి హార్డింగుల ఏర్పాటుకు వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేసి వారిని ఇబ్బంది పెట్టింది వాస్తవమా కాదా అని అడిగారు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప నాయకుడని,కౌశిక్ రెడ్డి కి, మంత్రి పొన్నం కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో జమ్మికుంట కౌన్సిలర్లు పొనగంటి సారంగం, పొనగంటి రాము,కుతాడి రాజయ్య,బొంగోని వీరన్న,మారపెల్లి బిక్షపతి, రావికంటి రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, బిట్ల మోహన్ కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర నాయకులు సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.