మెదక్ డిసెంబర్ 25 ప్రాజబలం న్యూస్ :-
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రసిద్ధిగాంచి మెదక్ జిల్లా చారిత్రక సంపద అయిన మెదక్ సీఎస్ఐ చర్చ్ ను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరిని చర్చ్ కమిటీ సెక్రెటరీ (మెదక్ పట్టణ బీఆరెస్ యువత అధ్యక్షుడు) శాంసన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల నిర్వాహక బృందం సాదరంగా ఆహ్వానించింది. అనంతరం ఎమ్మెల్సీ శేరితో చర్చ్ ప్రధాన బిషప్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఎమ్మెల్సీ శేరికి చర్చ్ బిషప్ యేసు ప్రభువు దీవెనలను అందించారు. ఈ సందర్భంగా మెదక్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకల కు హాజరైన భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులందరూ ఏసుప్రభు జన్మదినమైన ఈ క్రిస్మస్ పండుగను సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ప్రతిరోజు ప్రభువు యేసు చెప్పిన బాటలోనే పయనిస్తూ ఆధ్యాత్మిక ధోరణిలో జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మెదక్ సీఎస్ఐ చర్చ్ ను మెదక్ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు పవిత్ర ప్రదేశంగా భావిస్తారని అందుకే అన్ని మతాల ప్రజలు చర్చ్ ను సందర్శించి ప్రార్థనలు చేస్తారని, ఇంత గొప్ప చారిత్రాత్మక చర్చ్ మన ప్రాంతంలో ఉన్నందుకు మనకు గర్వ కారణమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శేరిని చర్చ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్సీ గారితో చర్చి కమిటీ సెక్రటరీ శాంసన్, కమిటీ సభ్యులు, బిషప్ లు, సర్పంచులు దేవా గౌడ్, మహిపాల్ రెడ్డి శ్రీను నాయక్ బిఆర్ఎస్ నాయకుడు జైపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు ఉన్నారు.