తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని విన్నపాలు
జగిత్యాల, ఆగస్టు 24: నేషనల్ హెల్త్ మిషన్ లో చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్నామని తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన అనంతరం కలెక్టరేట్ ఏ.ఓ. కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎం.ఎచ్.ఎం.ల సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం మాధురి మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా నేషనల్ హెల్త్ మిషన్ పతకంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నామన్నారు. చాలి చాలని వేతనాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నామని కరోన కష్టకాలంలో తమ ప్రాణాలకు తెగించి ప్రజారోగ్య పరిరక్షణ కోసం పాటుపడ్డామన్నారు. తమ ఉద్యోగాల పర్మినెంటుకై ఈ నెల చివరి వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని 31 తరువాత నిరవధిక సమ్మెలోకి పోతున్నట్లు మాధురి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులు వేణు తోపాటు పలువురు ఉన్నారు.