(కుత్బుల్లాపూర్- ప్రజాబలం న్యూస్)
డిసెంబర్17: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సర్కిల్-26 పరిధిలోని గాజులరామారంలో ప్రభుత్వ భూముల కబ్జాలు ఆగడం లేదు. కొద్ది రోజుల పాటు కబ్జాలకు విరామం ఇచ్చిన అక్రమార్కులు మళ్లీ నిర్మాణాల జాతర కొనసాగిస్తున్నారు. మండల రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్నా ఈ ఆక్రమణలను అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అసైన్డ్ భూములను తాము కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టిస్తున్న అక్రమార్కులు వాటి మాటున ప్రభుత్వ భూములను 80 గజాలు, 60 గజాల ప్లాట్ల చొప్పున మలిచి లక్షలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తక్కువ ధరకు ఇండ్ల స్థలాలు లభిస్తుండటంతో పాటు కబ్జాదారులు ఏకంగా ఇండ్ల స్థలాలకు సంబంధించి నోటరీ పత్రాలు ఇస్తుండటంతో పేదలు వీరి మాయలో పడుతున్నట్లు తెలుస్తుంది. చింతల్ చెరువు ఎఫ్‌టీఎల్/బఫర్ జోన్‌లోనూ ఓ వ్యక్తి ఇదే విధంగా అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసుకుని నోటరీలు ఇవ్వగా, వాటిని హైడ్రా కూల్చివేసిన విషయం విధితమే. రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన డబ్బులతో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన సుమారు 70 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సంపాదించిన డబ్బులు కబ్జాదారులకు ధారపోసినప్పటికీ ఇంటి స్థలం లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరిగినా భూ కబ్జాదారుల్లో వీసమెత్తు సానుభూతి కనిపించక పోగా మళ్లీ భూ ఆక్రమణలకు పాల్పడుతుండటం అనుమానాలకు తావిస్తోందంటున్నారు స్థానికులు. తాజాగా గాజులరామారంలోని దేవేందర్‌నగర్, కైసర్‌నగర్‌లోని సర్వేనంబర్ 342/1లో క్వారీగుంతను పూడ్చిమరీ స్థలాన్ని చదును చేస్తున్నా, ఆ పక్కనే రాజన్న బస్తీపేరుతో వందలాది ఇండ్లు నిర్మాణం జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలు లేకుండానే అక్రమార్కులు ఇంత సాహసానికి దిగుతున్నారా…? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ భూమిని 338, 339గా మార్చి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దొంగ అగ్రిమెంట్‌లను సృష్టించి, వాటిని నోటరీలుగా మలిచి పేదల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంటున్న భూ భకాసురులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయినా అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దనే విషయం అటు అధికారులకు గాని, ఇటు కబ్జాదారులకు గాని తెలియని విషయమా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కబ్జాలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్-
క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం…
ఇదే విషయమై కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెహమాన్‌ను వివరణ కోరగా గాజులరామారం, దేవేందర్ నగర్, కైసర్ నగర్‌లో జరుగుతున్న భూ ఆక్రమణలు తన దృష్టికి రాలేదన్నారు.అన్నింటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు.