అవగాహన కార్యక్రమంలో ఆర్.ఎస్.ఐ కృష్ణ
జగిత్యాల, ఆగస్టు 24: ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలని అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని డి.ఆర్.ఎస్.బి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. కృష్ణ అన్నారు. గురువారం ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో అల్ఫోర్స్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆర్.ఎస్.ఐ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్లపై నడిచేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటిస్తూ రోడ్డుకు ఎడమవైపు నడవాలని సూచించారు. మైనర్లు వాహనాలను నడపరాదని నడిపితే చట్టరీత్య చర్యలకు గురవుతారన్నారు. మైనర్లు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమైన మరణాలకు దారితీసినా వారి తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకొని ఇతరులకు మార్గదర్శకులు కావాలని ఆర్.ఎస్.ఐ కృష్ణ కోరారు. అనంతరం ట్రాఫిక్ ఎస్.ఐ. రామచంద్రము మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.