ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 21 (ప్రజాబలం) ఖమ్మం ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని వామపక్షాల నేతలు ఆరోపించారు. సిపిఐ, సిపిఎం, ప్రజాపంథా పార్టీల సంయుక్త సమావేశం గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుందని తమను ప్రశ్నించే వారు చట్టసభలలోనూ, బయట ఉండకూడదన్నదే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తుందన్నారు. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేస్తున్నారని వామపక్ష నేతలు తెలిపారు. నియంతలా వ్యవహరిస్తున్న మోడీ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ ఈనెల 22న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం అంబేడ్కర్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు వారు తెలిపారు. ప్రజాస్వామ్య వాదులు, వామపక్ష కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ప్రజాపంథా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, వివిధ పార్టీల నేతలు కొండపర్తి గోవిందరావు, తాటి వెంకటేశ్వరరావు, ఆవుల అశోక్, తోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు