ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

పెండింగ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు పూర్తి చేయాలి.

విద్యార్థుల ఏకరూప దుస్తులు, పాఠ్యాంశ పుస్తకాల పంపిణీ పూర్తి.

సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు.

పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి.

వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 09 : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,ఐటిడిఏ పి. ఓ. చిత్రా మిశ్రా,
అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవేన్యూ సి.హెచ్. మహేందర్ జి లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

వన మహోత్సవం, ప్రజాపాలన సహాయ కేంద్రాల నిర్వహణ, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, వానా కాలం పంటల సాగు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఉద్యోగుల సాధారణ బదిలీలు వంటి పలు అంశాలను సీఎస్ సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమం క్రింద నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. జిల్లాలలో పల్లె ప్రకృతి వనాలు, అర్భన్ పార్క్ లలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గతంలో నాటిన మొక్కలలో చనిపోయిన మొక్కలను రిప్లేస్ చేయాలని అన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే మొక్కల పెంపకం,
వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయు నూతన మీ సేవా కేంద్రాలలో వీలైనంత మేర మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేయాలని, ఆసక్తి, అర్హత గల మహిళల గుర్తింపు, వారి శిక్షణ, బ్యాంకు లింకేజ్ రుణం వంటి అంశాలను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సిఎస్ అన్నారు.

జిల్లాలో ప్రముఖమైన ప్రదేశాలలో మహిళా సంఘాలచే అమ్మ క్యాంటీన్ లను ఏర్పాటు చేయాలని, మహిళా శక్తి క్రింద ఇతర వినూత్న కార్యక్రమాలను అమలు చేసేందుకు సలహాలు, సూచనలు ఉంటే ప్రభుత్వానికి అందజేయాలని సిఎస్ తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని, ఆ రుణాలతో మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని అన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి చివరి దశ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సీఎస్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి రెండవ జత ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను పంపిణీ పూర్తి చేయాలని అన్నారు.

వానాకాలం ప్రారంభమై వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల సాగు పెరుగుతుందని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. విత్తనాల లభ్యత అంశాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని అన్నారు. రైతు భరోసా వర్క్ షాప్ లను పకడ్బందీగా నిర్వహించా లని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసుల వ్యాప్తి అరికట్టాలని, స్థానిక సంస్థల అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామాలు, పట్టణాలలో రెగ్యులర్ గా ఫాగింగ్ నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని అన్నారు.

పెండింగ్ ధరణి దరఖాస్తులను ప్రత్యేక శ్రద్దతో పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జిల్లా స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.

వీడియోసమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఉద్యోగ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బదిలీలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జిల్లా క్యాడర్ పోస్టుల బదిలీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వులలోని నిబంధనల ప్రకారం 4 సంవత్సరాలు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, అదే సమయంలో 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని,
జూలై 12 వరకు బదిలీల కొరకు దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలో నాలుగు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉద్యోగులు, శాఖ పరిధిలోని ఖాళీల తుది జాబితాను రూపొందించి ఉద్యోగస్తులకు అందుబాటులో పెట్టాలని, రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులలోని ప్రాధాన్యత క్రమం వరుసలో బదిలీలు చేపట్టడం జరుగుతుందని, జిల్లా స్థాయి క్యాడర్ బదిలీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీఓ కే. సత్యపాల్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, డిఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, డి సి ఓ సర్దార్ సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking