జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 09:
జిల్లాలో 18 సంవత్సరాల వయసు నుండి అర్హత గల ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల మండల తహసిల్దార్ తో కలిసి సందర్శించి ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పని తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరి పేరు, వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతన ఓటరు నమోదు కొరకు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని, నూతన ఓటరు నమోదు కొరకు అభ్యర్థులు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మార్పులు, చేర్పులు,తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదు చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.