నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు.
ములుగు జిల్లా కేంద్రం లోని లక్ష్మీ ఎరువులు పురుగుమందులు విత్తనాల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 31: శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు జిల్లా కేంద్రం లోని లక్ష్మీ ఎరువులు పురుగుమందులు విత్తనాల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణం లోని విత్తనాలను స్వయంగా కలెక్టర్ పర్శిలించి, విత్తనాలకు సంబంధించిన కంపని వివరాలను , ఎమ్మార్పీ ధరలను , కంపెనీ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకున్న రసీదులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నేరుగా రైతులకు ఫోన్ ద్వారా సంభాషించి విత్తనాలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించారా లేదా అధిక ధరలకు విక్రయించారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2024 పంటకు జిల్లాలో అవసరమైన మేర విత్తనాలు అందుబాటులో స్టాక్ పెట్టుకున్నమని, రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా మన జిల్లాలో విత్తనాల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కొరత రాకుండా అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఎక్కడ నకిలీ విత్తనాలు విక్రయం కాకుండా గట్టిగా నిఘా ఏర్పాటు చేశామని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ అధికారులు పోలీస్ అధికారులతో కలిపి టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విడిగా ఉన్న సంచులోని విత్తనాలను కొనుగోళ్లు చేయవద్దని. ఆయా కంపెనీ లేబుల్ కలిగిన ప్యాకెట్లను కొనుగోలు చేయాలన్నారు. రైతులు విత్తనాలు కొనుగోళ్లు చేసిన డీలర్ నుండి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యవసాయ శాఖ ద్వారా గుర్థింపు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. విత్తనాల ఖాళీ ప్యాకెట్లను, బిల్లులను పంటకాలం పూర్తయే వరకు భద్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర, ములుగు ఏ డి శ్రీపాల్, ఏ ఓ సంతోష్, తదితరులు ఉన్నారు.