ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధంలాంటిది

 

జాతీయ ఓటర్ల దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు, జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 25:
ఓటు అనేది ప్రజల చేతుల్లో ఆయుధమని దానిని తప్పకుండా వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియమ్‌లో జరిగిన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ… ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధమని… దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఓటు వేసి మంచి భవిష్యత్తును నిర్ణయించడం అనేది మన చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును మొదటిసారి వినియోంచుకున్న యువత ఎంతో ఆనందంగా ఓటు వేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఎంతో విజయవంతం అయ్యాయని… రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. ఈ ఎన్నికలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఓటింగ్ విషయంలో ముఖ్యంగా యువత ఓటింగ్ రోజును సెలవు రోజుగా కాకుండా తమ భవిష్యత్తును నిర్ణయించే రోజుగా భావించి తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ కోరారు. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఓటు హక్కు ఉన్న వారిని వినియోగించుకునేలా సెలవులు ఇచ్చేలా సౌకర్యాలు కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రాధాన్యతను ఆమె తెలిపారు. ఓటు అంటే బుల్లెట్ అని అనుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఉండటం గర్వించదగిన విషయమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఓటు హక్కు అనేది ఒక బాధ్యగా భావించి యువత తప్పకుండా తమ ఓటు వేయాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ వారు పోలింగ్ బూతులలో తగిన వసతులు కలిపించాలని అన్నారు. పోలింగ్ బూత్‌ల వద్దకు రాలేని దివ్యాంగులు, వృద్ధుల కోసం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం అభినందనీమయమన్నారు. మంచివారిని ఎన్నుకుంటే సుపరిపాలన అందించగలరని తెలుపుతూ భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని… దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మాట్లాడుతూ… 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రంలో ఇటీవల విజయవంతం చేసినందుకు ఎన్నికల అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా అబ్రహాంలింకన్ మాటలను ఆయన గుర్తు చేశారు. యువత ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువత ఓటు వేయాలని తెలిపారు. ప్రస్తుతం ఓటు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పెరగగా… హైదరాబాద్ వంటి పట్టణాల్లో తగ్గిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు మరింత కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన వికాస్‌రాజ్ మాట్లాడుతూ…. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా కొత్తగా ఓటర్ల నమోదుకు సంబంధించి కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారు 9.99,667 ఓటర్లు నమోదైనట్లు వివరించారు. అలాగే 2023 సంవత్సరంలో 7.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారని… ఫిబ్రవరి 8వ తేదీ వరకు మరింత పెరుగుతుందన్నారు. అలాగే ఆన్లైన్లో, బీఎల్వోల ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వికాస్ రాజ్ కోరారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా జరిగాయని… 80 సంవత్సరాలు నిండిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముందుగా పోలీసులు గౌరవ వందనం చేయగా… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి, సీఈవో వికాస్‌రాజ్, అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఆయా పోటీల్లో విజేతలైన విద్యార్థులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అధికారులు అందచేశారు. అలాగే ఎపిక్ కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking