– జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈశ్వరయ్య
– ‘పాట, పద్యం- సామాజిక స్పృహ’ అనే అంశంపై ప్రసంగం
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 9
ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట ఫ్యాకల్టీ ఫోరం నిర్వహణలో మంగళవారం ‘పాట, పద్యం- సామాజిక స్పృహ’ అనే అంశంపై తెలుగు అధ్యాపకులు రేన ఈశ్వరయ్య ప్రసంగించారు. సమావేశాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్ ప్రారంభిస్తూ వరుస సమావేశాలను నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ ఫోరం కన్వీనర్ ఎడమ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. సామాజిక స్పృహను పెంచడంలో పాట ప్రాముఖ్యత గొప్పదని చెప్పారు. ఈశ్వరయ్య పైన పేర్కొన్న అంశంపై మాట్లాడుతూ.. బాధ నుంచి విముక్తి కలిగించేది పాటని పేర్కొంటూ ‘నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ నా పాటమ్మ’ అనే పాటను ఆలపిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
శ్రమ నుంచి పాట పుట్టిన విధానం, వివిధ సామాజిక ఉద్యమాలలో పాట నిర్వహించిన పాత్ర, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో పాట ప్రాముఖ్యత, తెలుగు సమాజంలో వివిధ దశలలో సామాజిక స్పృహను కలిగించడంలో పాట ఏ రకంగా తోడ్పడిందో..ఈ విషయాలన్నింటినీ తెలుగు సాహిత్యకారులను ఉటంకిస్తూ, సందర్భానుసారంగా పాటలను పాడుతూ పద్యాలను చదువుతూ ఈశ్వరయ్య గంటసేపు ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమానికి పాట ఊపిరిలూదిన సందర్భాన్ని గుర్తుచేశారు. పాటప్రస్థానాన్ని వివరించారు. పాటకున్న సరళత దృష్ట్యా అది జనంలోకి బలంగా దూసుకెళ్లిందని కానీ, పద్యం పండితులు రాయడం వల్ల అది పాటంతగా వెళ్లలేకపోయిందని స్పష్టం చేశారు.
కవులు కష్టజీవిని కాకుండా రాజులను మాత్రమే కొనియాడుతూ సాహిత్యాన్ని రాసిన విషయాన్ని వివరించారు. 19వ శతాబ్దంలో అభ్యుదయ కవి శ్రీశ్రీ..కష్టజీవినే ఉద్దేశించి రాసిన సాహిత్యాన్ని గురించి వెల్లడించారు. ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ రాసిన పలు కవితలను ఉటంకిస్తూ..కష్టజీవిపైన సవివరంగా ప్రసంగించారు. పనిని ఒక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవికి దక్కుతుందని నొక్కి చెప్పారు. కవులు గద్దర్, అందెశ్రీ, సుద్దాల హన్మంతు, బండి యాదగిరి, గూడ అంజన్న, జాషువా గుర్రం, దాశరథి రంగాచార్య, భాస్కర్ వంటి కవులు రాసిన పాటలను, సాహిత్యాన్ని సందర్భానుసారంగా ఉటంకిస్తూ పలు విషయాలపై ఈశ్వరయ్య అవగాహన కల్పించారు. సమాజంలో జరుగుతున్న ఘటనలను చూసి చలించి..తాను రాసిన ‘‘సమసమాజమా ఇది నీకు న్యాయమా? నవ సమాజమా ఇంత ఘోరమా?’’ పాట ద్వారా స్వార్థంపైన ధిక్కారాన్ని ప్రకటించారు. డబ్బు సంపాదనలో పడి మనిషి మాయామైపోతున్నాడన్న సంగతిని వివరిస్తూ అందెశ్రీ రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషడన్నవాడు’ అనే పాటను లయబద్ధంగా ఆలపించారు. బార్టర్(వస్తు మార్పిడి పద్ధతి), కరెన్సీ, డిజిటలైజేషన్ పద్ధతుల వల్ల మనిషి స్వార్థపూరితంగా మారిన సంగతిని వివరించారు. ప్రజల చేతుల్లో ఉన్న బలమైన వజ్రాయుధం ‘ఓటు’ అని పేర్కొన్నారు. జీవితం నీటిబుడగలాంటిదని చెప్పారు. డబ్బు సంపాదన ముఖ్యమేనని కానీ, దానికి ఓ పరిధి అంటూ ఉండాలని అభిప్రాయపడ్డారు. సత్యం, కీర్తి మాత్రమే శాశ్వతంగా నిలుస్తాయని, శోధించి, సాధించాలని విద్యార్థులకు సూచించారు. ‘‘ఈ జీవితం విలువైనది-పోయేటప్పుడు ఏదీ పట్టకునిపోము-మరణం రుచిచూడని మనిషెవ్వరు’’ అనే పాట పాడుతూ జీవిత పరమార్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ‘శుభలగ్నం’ చిత్రంలోని ‘చిలక ఏ తోడులేగా ఎటైపమ్మ ఒంటరి నడక..తెలిసి అడిగేసినవే ఎడారంటి ఆశల వెనక’ అనే సినీగీతంలోని పంక్తులను ఉదహరిస్తూ సిరిమైకంలో పడి అనుబంధాన్ని వదిలేసిన సందర్భాన్ని ప్రస్తావించారు. ధనం ఉంటే చాలదని, గుణం కూడా ముఖ్యమనే విషయాన్ని పేర్కొన్నారు.
ఈశ్వరయ్య ప్రసంగంపై స్పందిస్తూ ఫ్యాకల్టీ ఫోరం కన్వీనర్
ఎడమ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సాహిత్య ప్రయోజనం, దానిలో పాట ప్రాముఖ్యత, దాన్ని సామాన్య ప్రజలకు చేరవేయడానికి అధ్యాపకులు పబ్లిక్ ఇంటలెక్చువల్స్‌గా ఉండాల్సిన అవసరాన్ని, పాత్రికేయులు, బోధనా రంగంలో ఉన్నవాళ్లు సాంస్కృతిక ఉద్యమకారులుగా ఉండాలన్న ఆశయాన్ని వ్యక్తపరిచారు. మనచుట్టూ ఉండే పరిస్థితులను గమనించేది సాహిత్యమని చెప్పారు. అధ్యాపకులు నిరంతర విద్యార్థులుగా ఉంటూ.తమ విద్యార్థులకు పాఠాలు బోధించాలని తెలిపారు.
అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన ప్రశ్నలతో చర్చ కొనసాగింది. సమావేశంలో అధ్యాపకులు సుజాత, సువర్ణ, స్వరూపారాణి, సుష్మ మమత, అనూష, రమేష్, శ్రీనివాసరెడ్డి, రవి, ప్రశాంత్, సాయి కుమార్, అరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల కామర్స్ అధ్యాపకులు బల్గూరి మహేందర్ రావు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.