పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ,
29 జూన్ 2024 ,
ప్రజాబలం ప్రతినిధి,
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను రానున్న 10 రోజులలో పరిష్కరించాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నవీన్ మిట్టల్,జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

జూన్ 15 నుంచి జూన్ 28 వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల పై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల ఆన్ లైన్ లో అప్ డేట్ చేసి పరిష్కరించాలని అన్నారు.

నవీన్ మిట్టల్,చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతూ పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం పై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.

జిల్లా కలెక్టర్ల బదిలీల నేపథ్యంలో కొంత నెమ్మదించిన ప్రక్రియ ను వేగవంతం చేయాలని అన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు.

జిల్లాలో దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ , రికార్డుల పరిశీలన పూర్తవుతున్న నేపథ్యంలో సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ డిస్పోస్ చేయాలని అన్నారు. ఆర్ఎస్ఆర్ లిమిట్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సక్సెషన్ , మ్యూటేషన్, మొదలగు వివిధ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల పై అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం సమీకృత గురుకుల విద్యా సంస్థ ఏర్పాటుకు అనుకూలంగా 20 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని అన్నారు.ఆధార్ బయోమెట్రిక్ వేలి ముద్ర స్వీకరణ సంబంధించి
ఎల్ 0 పరికరాల వినియోగ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలకు ఎల్ 1 బయోమెట్రిక్ పరికరాలు పంపడం జరిగిందని, వీటిని సరిగ్గా రీప్లేస్ చేయాలని అన్నారు .

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking