భావితరాలకు ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించే దిశగా మనమంతా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలి

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 26 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు, ముదిగొండ మండలం వెంకటాపురం, ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల అర్బన్ పార్క్, కైకొండాయిగూడెం ఇండస్ట్రియల్ కాలనీల్లో కలెక్టర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలలో భాగంగా ప్రభుత్వం ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు వృక్షార్చన కార్యక్రమం చేపట్టిందని, ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 5.60 లక్షల మొక్కలు నాటుతున్నామని అన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ చాలా ముఖ్యమని,మొక్కల సంరక్షణ బాధ్యతను అధికారులతో స్థానికులు కూడా తీసుకోవాలన్నారు. మన భవిష్యత్తు తరాలు జీవనం కొనసాగించేందుకు అభివృద్ధి సంపదతో పాటు మంచి వాతావరణం, కలుషిత రహిత పర్యావరణం అందించడం చాలా ముఖ్యమని , చెట్ల ద్వారా ప్రాణవాయువు లభిస్తుందని, నేడు పెద్దఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత రక్షించడానికి పచ్చదనం పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కు హరితహారం కార్యక్రమం చేపట్టి పెద్దఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణ చేస్తుందని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, సంపద వనాల క్రింద పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమే కాదని, ఇది ప్రజలు, మనందరి కార్యక్రమమని ఆయన అన్నారు. ప్రజలు స్వచ్చందంగా పాల్గొని భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, ఏడి మైన్స్ సంజయ్, ఎల్డిఎం శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి జిల్లా వ్యవసాయ అధికారిణి సరిత, ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, ఎంపిపిలు బెల్లం ఉమ, సామినేని ప్రసాద్, 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ, ఎంపిడివోలు రవీందర్ రెడ్డి, అశోక్ కుమార్, తహశీల్దార్లు రామకృష్ణ, రామారావు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking