జనవరి 27, 2026 – ఆదిలాబాద్ ప్రజాబలం ప్రతినిధి:
పవిత్ర రంజాన్ మాసాన్ని ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, అందువల్ల అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సహర్, ఇఫ్తార్ సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మసీదుల వద్ద వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. మసీదులు, ఈద్గాల పరిసరాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. పండుగ సమయంలో పండ్లు, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉండేలా సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అధికారులు, మత పెద్దలు సమన్వయంతో రంజాన్ వేడుకలు ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ‘అరైవ్ అలైవ్’ అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువత రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. రాత్రి 11:30 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరగవద్దని, నాయకులు, పెద్దలు యువతకు సూచించాలని కోరారు.
అనంతరం పలువురు మత పెద్దలు తమ సూచనలు, సలహాలు తెలియజేశారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కలీమ్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మసీదుల కమిటీ సభ్యులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.