ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 30 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తికి చెందిన బైరి కిరణకుమార్ తాను రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఇంటిలో వేరొకరు తమ సామాగ్రిని పెట్టి తన ఇంటిని వారి పేరిట మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన కస్తూరి చిన్నబాబు తాను దివ్యాంగుడిని అయినందున తనకు 4 చక్రాల వాహనం మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల మండలం దొరగారిపల్లె గ్రామానికి చెందిన ముత్తె మల్లయ్య తాను కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని,కూరగాయలను తరలించేందుకు తనకు ఆటో ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల జిల్లా చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు తమ దరఖాస్తులో దండేపల్లి మండలంలోని చింతలచెరువు, అయ్యవారికుంట, నల్లకుంట చెరువుల భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన చల్ల సత్తయ్య తనకు గ్రామ శివారులో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిని కొందరు అక్రమంగా తమ పేరిట పట్టా మార్చుకొని రుణమాఫీ పొందుతున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన యాదనవేని పర్వతాలు తన తండ్రి పేరిట గ్రామ శివారులో గల భూమిని ఆయన మరణానంతరం తనకు తెలియకుండా తన తల్లి,తమ్ముడు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇట్టి భూమిలో ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎల్తపు శంకరయ్య తనకు గ్రామ శివారులో ఉన్న భూమి విస్తీర్ణం పట్టా పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు అయిందని, ఈ పొరపాటును సవరించి నూతన పాసుపుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన పెరుగు శ్రీనివాస్ తనకు కులం, ఆదాయం ధ్రువపత్రాలు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల శంకరయ్య తనకు చెందిన మామిడి, టేకు చెట్లు కోమటిచేను చెరువు ముంపులో పోయాయని తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తాండూర్ మండల కేంద్రానికి చెందిన దుర్గం బాపు తనకు చెందిన భూమికి సంబంధించి రుణమాఫీ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన జగన్నాథం తిరుపతి గ్రామ శివారులోని తన భూమికి హద్దులు నిర్ధారించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.నస్పూర్ మున్సిపాలిటీలోని అభినవ కాలనీ వాసులు తమ అనుమతి లేకుండా నిర్మించిన సెల్ టవర్ తొలగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణి దరఖాస్తులో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking