జిల్లాలో వెంటనే టీచర్ల సీనియారిటీ జాబితా ఖాళీల వివరాలు ఆన్లైన్లో నమోదు
ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు,
మన ఊరు – మన బడి, మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలి
జిల్లా వ్యాప్తంగా మన ఊరు – మన బడికి అంతా సిద్దం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్.
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 27: 56498టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు – మనబడి కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,
రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి టీచర్ల బదిలీ పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు– మనబడి, మోడల్ పాఠశాలలు అంశాల పై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినితికి తావు లేకుండా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలులేదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్లో ప్రదర్శించాలని, వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకుఈ సందర్భంగా సూచించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ… టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్దం చేయాలని, మరో రెండు రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. అలాగే మన ఊరు – మన బడి కార్యక్రమం కింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం చేయాలని తెలిపారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మన ఊరు – మన బడికి సంబంధించి పాఠశాలల్లో అన్నీ సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు – మన బడిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మన ఊరు – మన బడి కార్యక్రమానికి 30 పాఠశాలలను ఎంపిక చేయగా అందులో ఇప్పటి వరకు 25 పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్దం చేసినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం అన్ని పనులు జరుగుతున్నాయని… ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చేశామని పేర్కొన్నారు. అలాగే మిగిలిన ఐదు పాఠశాలల్లో సైతం అన్ని వసతులు కల్పించనున్నట్లు వివరించారు. ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత అధికారులకు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశామని త్వరలోనే పూర్తవుతాయని కలెక్టర్ తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా విద్యాధికారిణి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.