జీఓ నం.59 ముసుగులో రూ.8కోట్ల భూమి క్రమబద్ధీకరణ
మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేసిన మందుమూల పరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్ ప్రజాబలం ప్రతనిధి :ఉప్పల్‌లోని కల్యాణపురి-హైకోర్టుకాలనీ మధ్యలో వాటర్ ట్యాంకుల దగ్గర ప్రభుత్వ భూమిని కొందరు ప్రజాప్రతినిధులు మింగేశారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన ఓ నేతనే రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని జీఓ నం.59 ముసుగులో 1050 గజాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించుకున్నాడు.
జీఓ నం.59 ముసుగులో సుమారు రూ.8కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి తీసుకెళ్లారు.
అక్రమంగా జీఓ ముసుగులో రెవెన్యూ అధికారుల అండదండలతో జరిగిన క్రమబద్దీకరణపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని మంత్రిని కోరారు. అర్హత లేనప్పటికీ జీఓ 59 కింద 1050 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించిన ఎమ్మార్వోలపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అక్రమంగా చేసిన క్రమబద్ధీకరణపై సీరియస్‌గా స్పందించారని పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకోనున్నట్టుగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారన్నారు.