జగిత్యాల ప్రతినిధి, మే 1:(ప్రజా బలం) ప్రపంచ దేశాల్లోని కార్మిక లోకానికి కర్షక పండగను అన్ని దేశాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నారని అదే తరహాలో ఇండియాలో అధికారికంగా నిర్వహించాలని ఏఐటియుసి జగిత్యాల జిల్లా కార్యదర్శి ఎండి. ముక్రం కోరారు. సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో జగిత్యాల లోని పలు కూడళ్లలో బీడీ, గ్రామ పంచాయతి, మునిసిపల్, భవన నిర్మాణ, హమాలి, మెడికల్ వివిధ రంగాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక జెండా ఎగురవేసి మేడే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముక్రం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు మేడేను అధికారికంగా నిర్వహిస్తారన్నారు. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలం చెంది కార్మికులను పట్టించుకోవడంలో పూర్తిగా విస్మరిస్తూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు 18 గంటల పనిదినాన్ని నిరసించి బానిస బతుకుల విముక్తి కోసం, ఎనిమిది గంటల పనిదినం కోసం వేలాదిమంది కార్మికులు చేసిన పోరాట ఫలితమే మే డే అని అన్నారు. ఏఐటియుసి జెండా కార్మికులకు అండగా పనిచేస్తుందని, ప్రభుత్వాలు అధికారికంగా సెలవు ప్రకటించకుండా కపట ప్రేమను చూపిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడే ను అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని ముక్రం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ముక్రం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు కిరణ్, శ్రీనివాస్, ధర్మయ్య, అల్తాఫ్, మహేష్, డివి రాజు, రాజగంగు, రహిమా, లక్ష్మి, సతీష్, అక్రమ్ లతోపాటు కార్మికులు ఉన్నారు.