ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 20(ప్రజాబలం) ఖమ్మం పరిపాలనలో క్షేత్ర స్థాయి అనుభవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని గ్రామాల్లో సామాజిక ఆర్థిక స్థితిగతులపై అనుభవపూర్వమైన అభ్యాసానికి వచ్చిన భారత ప్రభుత్వ సెంట్రల్ సెక్రెటరియేట్ సర్వీసెస్ కు చెందిన 2022 బ్యాచ్ కు చెందిన అసిస్టెంట్ సెక్షన్ అధికారులతో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, వారి క్షేత్రస్థాయి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయి అవగాహనకు జిల్లాలో ఈ నెల 16 నుండి 20 వరకు గ్రామాల్లో పర్యటించి గ్రామీణ సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసినట్లు వారు కలెక్టర్ కు తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ది ప్రజలకు చేరుతున్నట్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతున్నట్లు వారు వివరించారు. స్వయం సహాయక బృందాలు క్రియాశీలకంగా ఉన్నట్లు వారు కలెక్టర్ తో అన్నారు. 5 గురు చొప్పున సహాయ సెక్షన్ అధికారులు సభ్యులు గల 5 బృందాలు బోనకల్ మండలం ముష్టికుంట, కూసుమంచి మండలం గట్టుసింగారం, వైరా మండలం విప్పాలమడక, కొనిజర్ల మండలం గుబ్బకుర్తి, సింగరేణి మండలం భాగ్యనగర్ తాండాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేశారు. పథకాల లబ్ది చిట్టచివరి లబ్దిదారునికి అందేలా చూడాలన్నారు. అమలులో సమస్యలను అధిగమించే చర్యలు చేపట్టాలన్నారు. అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డిఆర్డీఓ విద్యాచందన, కేంద్ర సెక్రెటరియేట్ సర్వీస్ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు ఉన్నారు.