జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి ప్రజాబలం 17 అక్టోబర్:
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల పకడ్భందీ ఏర్పాట్లు చేయడంతో పాటు ఎన్నికల అధికారులందరూ పూర్తి సమన్వయంతో విధులు నిర్వహించేలా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకొన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3వ తేదీన ప్రారంభమమై…. నవంబరు 10వ న ముగుస్తుందని… అందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అలాగే నవంబరు 13న స్క్రూటినీ నిర్వహించడం జరుగుతుందని….నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15 వరకు సమయం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. అనంతరం నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి… డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని గౌతమ్ తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 26,91,167 మంది ఓటర్లు ఉండగా… 2,397 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. ఈ విషయాలపై ఇప్పటికే అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు సైతం నిర్వహించామని… ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్భందీగా అమలు చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పదహారు విభాగాలకు ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. దీంతో పాటు ఐదు నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని… అవసరమైన మేర బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సర్వేలెన్స్ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్సు బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఈ సందర్భంగా వివరించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజల 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సీ– విజల్ యాప్ ద్వారా చేయవచ్చని తెలిపారు. జిల్లాలో ఎన్నికల వ్యయమానిటరింగ్ సమావేశాన్ని బ్యాంకర్లతో నిర్వహించినట్లు… బ్యాంకర్లకు, బ్యాంకు ఖాతాదారులకు ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్ధేశం చేసినట్లు తెలిపారు. జిల్లాలో నగదు లావాదేవీలు, డబ్బు, బంగారం వంటివి రవాణ చేసేటప్పుడు తగిన ఆధారాలు ఉండాలని అలాగే రూ.50 వేల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అందుకు తగిన రుజువులు, ధ్రువీకరణ పత్రం జతచేయాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. జిల్లాలో ఎన్నికల సమయంలో ప్రజల సౌకర్యార్థం ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2050 కు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సీ– విజిల్ 24 గంటలు పర్యవేక్షణ కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు “సువిధ యాప్ “ద్వారా సభలు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయాలు, లౌడ్ స్పీకర్లు, ఇంటింటి ప్రచారం, డిస్ప్లే బ్యానర్లు, బ్యారీకేడ్లు, పార్టీలకు చెందిన ఫ్లాగ్లకు సంబంధించి అనుమతులు పొందడానికి వీలుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. అలాగే గుర్తింపు పొంది రిజిస్ట్రేషన్ చేసుకొన్న పార్టీల నుంచి శాసనసభ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులకు సులభమైన పద్ధ తిలో “సువిధ యాప్” ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీటింగ్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, ఇంటింటి ప్రచారం, డిస్ప్లే బ్యానర్స్, బారికేడ్లు, ప్లాగ్స్ అనుమతులకు సులభతరంగా ఒకే చోట 48 గంటల్లో అనుమతులు కల్పించేందుకు ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ యాప్లో అనుమతి పొందిన 72 గంటల పాటు వ్యాలిడిటీ ఉంటుందని…ఎన్నికల ప్రవర్తనా నియమావళికి నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారని… ఆర్వో కార్యాలయాల వద్ద నియోజకవర్గం నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న అధికారిని నియమించడం జరుగుతుందని…వీరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎలాంటి శాంతిభద్రతలకు ఇబ్బందులు కలగకుండా అనుమతులు పారదర్శకంగా జారీ చేస్తారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమయంలో అధికారులు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking