మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ గంగారాం
జగిత్యాల, మార్చి 23: జగిత్యాల నియోజకవర్గములోని పదవుల్లో అమలు చేయాల్సిన ఎస్సి, బిసి రిజర్వేషన్ల అమలులో స్థానిక బీఆర్ఎస్ నేతలు తూట్లు పొడుస్తున్నారని మహాజన సోషలిస్ట్ పార్టీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం ఆరోపించారు. గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల నియోజకవర్గములోని అర్బన్ మండల ఎంపిపి స్థానాన్ని ఎస్సి కి కేటాయించగా, రూరల్ ఎంపిపి బిసిలకు కేటాయించారన్నారు. ఈ ఇరువురు ఎంపిపిలు కరోనాతో మృతిచెందగా ఇప్పటికి పూర్తిస్థాయిలో నియామకాలు జరగక ఇంచార్జ్ ల పాలనలో నడుస్తూ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సి రిజర్వుడ్ స్తానాల్లో ఇతరులను కూర్చోబెట్టి డా.అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయక స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నాడని గంగారాం అన్నారు. అలాగే స్థానిక మునిసిపల్ ఛైర్మన్ అంశంలోను బిసి మహిళ వైదొలగగా మరో బిసి మహిళను ఇప్పటికి నియమించక బిసి రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఎస్సి, బిసి రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేందుకు, నియంతృత్వ పాలన చరమ గీతం పాడేందుకు ఎస్సి, బిసి బిడ్డలు ఏకం కావాలని మహాజన సోషలిస్టు పార్టీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం పిలుపునిచ్చారు.
ఆయన వెంట మహాజన సోషలిస్ట్ పార్టీ కోకన్వీనర్ బెజ్జంకి సతీష్, ఎమ్మార్పిఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీను, ఎమ్మార్పీఎస్ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి దీకొండ మహేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ బుగ్గారం మండల ఇన్చార్జి చిర లక్ష్మణ్ మాదిగ లు ఉన్నారు.