ప్రభుత్వం జీహెచ్ఎంసీకి 700 కోట్లు విడుదల చేయడంపై కృతఙ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు
ఎస్టేట్స్ లో వస్తున్న ఆదాయం, ఆస్తుల వివరాలను అందించాలి
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: ఫిబ్రవరి 20: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం 8వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో వివిధ రహదారుల విస్తరణ, మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కొరకు కార్పొరేషన్ ద్వారా సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీ సమావేశంలో 15 అంశాలు, 6 టేబుల్ ఐటమ్ లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… స్టాండింగ్ కమిటీ సమావేశాలు అన్ని కూడా ఆరోగ్యకరమైన స్నేహపూరిత వాతావరణంలో జరిగాయని, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకున్నామని, అందుకు పూర్తి స్థాయిలో స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ అభివృద్ధికి ఈ సంవత్సర కాలంలో 700 కోట్ల రూపాయాలు విడుదల చేసిందని తెలిపారు. రూ. 700 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వానికి స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ క్రీడా ప్రాంగణాల పై సంబంధిత అధికారులు పూర్తి పర్యవేక్షణ చేసి జీహెచ్ఎంసీకి ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని కోరారు. అత్యధికంగా ఆదాయం వస్తున్న క్రీడా ప్రాంగాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ… అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. సభ్యులందరితో కలిసి పనిచేయడం తనకు ఒక మంచి అనుభవమని పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ, జంక్షన్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా అభివృద్ధి పనులకు గాను ప్రతి జోన్ కు 25 కోట్ల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తుల వివరాలు, వాటి పై వస్తున్న ఆదాయ వివరాలను అందించాలని ఎస్టేట్ అడిషనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ కు కమిషనర్ సూచించారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కాపాడేలా డిజిటలైజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మహమ్మద్ ముజాఫర్ హుస్సేన్, ఫాహెద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దత్, మహమ్మద్ ఖాదిర్, పొడవు అర్చన, మహమ్మద్ నజీర్ ఉద్దీన్, గౌస్ ఉద్దీన్ మహమ్మద్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, సబీహా బేగం, ఆవుల రవీందర్ రెడ్డి, కంది శైలజ, అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, నళిని పద్మావతి, గీతా రాధిక, చంద్రకాంత్ రెడ్డి, సత్యనారాయణ, సుభద్రాదేవి, అశోక్ సామ్రాట్, అలివేలు మంగతాయారు, పంకజ, యాదగిరి రావు, రఘు ప్రసాద్, ఈ.ఎన్.సి భాస్కర్ రెడ్డి, సీ.ఈ కోటేశ్వరరావు, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ్ చౌహాన్, అనురాగ్ జయంతి, రవికిరణ్, వెంకన్న, ఉపేందర్ రెడ్డి, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, చీఫ్ ఎగ్జామినర్ (అకౌంట్స్) వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలు
1. హెచ్-సిటీ కింద కేబీఆర్ పార్కు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద 30 మీటర్లు, 36, మరియు 66 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం 18 ఆస్తుల సేకరణకు ప్రభుత్వ అనుమతి కోసం కార్పొరేషన్ ద్వారా సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
2. హెచ్-సిటీ కేబీఆర్ పార్కు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ 36 మీటర్లు, 40.5, మరియు 45 మీటర్ల వెడల్పుతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 47 ఆస్తుల సేకరణకు ప్రభుత్వ అనుమతి కోసం కార్పొరేషన్ ద్వారా సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
3. హెచ్-సిటీ కింద కేబీఆర్ పార్కు ముగ్దా జంక్షన్ వద్ద 30 మీటర్లు, 36 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం 40 ఆస్తుల సేకరణకు ప్రభుత్వ అనుమతి కోసం కార్పొరేషన్ ద్వారా సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
4. అక్టోబర్, 2024 నుండి డిసెంబర్ 2024 వరకు జిహెచ్ఎంసి కి సంబంధించిన ఆదాయ, వ్యయాలను సమాచారం నిమిత్తం కమిటీ సమర్పించడం.
5. శేరిలింగంపల్లి జోన్ యూసుఫ్ గూడ సర్కిల్ బోరబండ లోని స్లమ్ ఏరియా నిరుద్యోగ యువత, నిరుపేద మహిళలకు సీ.ఎస్.ఆర్ కింద లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ వారి సొంత నిధులతో సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లవ్లీ హుడ్ ప్రోగ్రాం ద్వారా శిక్షణలు నిర్వహించుటకు ఒక సంవత్సర కాలం పాటు బోరబండ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ ను స్వాధీనం చేయుటకు అనుమతిస్తూ సంబంధిత ఏజెన్సీ తో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఎం.ఓ.యు చేయుటకు కమిటీ ఆమోదం.
6. బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలో మిధాని బస్ స్టేషన్, బస్ డిపో నిర్మాణం కోసం టీ.జీ.ఎస్.ఆర్టీసీ కి కేటాయించిన 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎన్.ఓ.సి జారీ చేయుటకు జీహెచ్ఎంసీకి సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
7. బుద్ధ భవన్ లో నాలుగో అంతస్తు ఏ బ్లాక్ లో గల తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లీజు వ్యవధి తదుపరి రెండు సంవత్సరాలు పొడిగింపునకు (19-07-2023 నుండి 18-07-2025 వరకు) మరియు అద్దె పెంపునకు కమిటీ ఆమోదం.
8. అల్విన్ ఎక్స్ రోడ్ మియాపూర్ నుండి హఫీజ్ పేట్ ఫ్లైఓవర్ వరకు ప్రతిపాదిత 24 మీటర్ల రోడ్డును 60 మీటర్ల విస్తరణ మార్చుటకు 132 ఆస్తుల సేకరణకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ అనుమతికి సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
9. హెచ్-సిటీ కింద ఖాజాగూడ జంక్షన్ వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సవరించిన జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ ప్రణాళిక మేరకు 10 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
10. రోడ్ డెవలప్మెంట్ ప్లాంన్ లో భాగంగా రోడ్ నెం.82 నుండి ఫిల్మ్ నగర్ మీదుగా ఏబీఎన్ రోడ్డు వరకు 24 మీటర్ల రోడ్డు వెడల్పునకు 13 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
11. గాజుల రామారం హనుమాన్ దేవాలయం కైసర్ నగర్ నుండి మిథిలా నగర్ జీహెచ్ఎంసీ పరిధి వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 40 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
12. హెచ్-సిటీ కింద ఐఐఐటీ జంక్షన్ వద్ద ప్రతిపాదిత మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రీవైజ్డ్ జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ కొరకు 65 మీటర్లు, 36 మీటర్ల రోడ్డు అభివృద్ధి 21 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
13. రంగేలి కిడికి ఎక్స్ రోడ్ నుండి ఇమ్మా-ఈ-ఖాసీం అలావా వరకు ప్రతిపాదిత 12 మీటర్ల రోడ్డు అభివృద్ధి కొరకు 76 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
14. గోపన్ పల్లి అపర్ణ హిల్స్ నుండి వట్టినాగుల పల్లి విలేజ్ రోడ్ వరకు ప్రతిపాదిత 30 మీటర్ల రోడ్డు అభివృద్ధికి 4 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
15. మిధాని బస్టాప్ నుండి మాజిద్ ఈ గులాం హౌస్ వరకు 12 మీటర్ల రోడ్డు అభివృద్ధిలో భాగంగా 38 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
టేబుల్ ఐటమ్స్
1. జూబ్లీహిల్స్ లోని బంజారా భవన్ నుండి బంజారా చెరువు వరకు వరద నీటి కాలువ ను నిర్మించుటకు రూ.22.17 కోట్లు మంజూరికి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
2. ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ వివేకానంద విగ్రహం నుండి కావేరి నగర్ కల్వర్ట్ వరకు రూ. 6 కోట్ల వ్యయంతో 100 మిల్లీ మీటర్ డయా పైప్ లైన్ నిర్మించుటకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం.
3. ఈ-ఆఫీస్ అప్లికేషన్ పనులకు మెస్సర్స్ రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కు మూడు సంవత్సరాల కాలానికి గాను రూ. 3,09,79,068 చెల్లించుటకు పరిపాలన అనుమతికి కమిటీ ఆమోదం.
4. జీహెచ్ఎంసీ పరిధిలో 1600 కొత్త సిసిఎంఎస్ బాక్స్ ల కొనుగోలుకు గాను మెసర్స్ సన్రేస్ ఏజెన్సీ కు కేటాయించిన పనికి గాను రూ. 2,26,52,224 లకు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ మరియు రాటిఫికేషన్ కు కమిటీ ఆమోదం.
5. ప్రగతి నగర్ నుండి వయా ఎల్లమ్మ బండ మహదేవపురం వెటర్నరీ హాస్పిటల్ వరకు ప్రతిపాదిత 30 మీటర్ల లింక్ రోడ్ కొరకు 8 ఆస్తుల సేకరణకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.
6. దారుసలాం నుండి చక్నావాడి కల్వర్ట్ వరకు ఆర్.సి.సి బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి రూ. 740 లక్షల అంచనా వ్యయానికి పరిపాలన అనుమతి కొరకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కమిటీ ఆమోదం.