బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పర్మాల క్రిష్ణ
హైదరాబాద్,ఏప్రిల్ 4 : ట్యాంక్ బండ్ నుంచి ముసారాంబాగ్ వద్ద ఉన్న మూసీ నది వరకు ఉన్న ప్రధాన డ్రైనేజీకి ఇరువైపుల రిటైయినింగ్ వాల్ కట్టే క్రమంలో పేదల ఇళ్లు కూల్చకుండా అధికారులను ఆదేశించాలని ప్రభుత్వానికి బహుజనసమాజ్ పార్టీ (బీఎస్పీ) విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పర్మాల క్రిష్ణ నేతృత్వంలో 30 మంది బాధితులు సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనరు వినతిపత్రాలు పంపించారు. డ్రైనేజీకి ఇరువైపుల 12 అడుగుల స్థలంలో గోడ నిర్మిస్తున్నారని, అందుకు గానూ ఇరువైపుల ఉన్న వందలాది ఇళ్లను కూల్చేస్తున్నారని బాధితులు సీఎంకు పంపించిన వినతిపత్రంలో తెలిపారు. ఇళ్లను కూల్చే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారని, దీనివల్ల వందలాదిమంది నిరాశ్రయులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఫివర్ ఆస్పత్రి సమీపంలో ఉన్న డ్రైనేజీకి ఇరువైపుల నివాసం చేస్తున్న పేదవర్గాల ప్రజలు గతంలో హైకోర్టుకు వెళ్లగా కోర్టు స్టే ఇచ్చిం దని, కోర్టు స్టే గడువు ముగియడంతో హఠాత్తుగా పోక్లెయిన్ లు తీసుకువచ్చి ఇళ్లను కూల్చేస్తున్నారని పేర్కొన్నారు.వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఇళ్లను కూల్చే చర్యలని నిలిపివేయాలని పర్మాల క్రిష్ణ విజ్ఞప్తి చేసారు.ఒకవేల కూల్చి వేయవలసి వస్తే నిర్వాసితిలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే కుల్చివేతలు జరుపాలని లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కృష్ణ హెచ్చరించారు.
Prev Post
Next Post