135 చెరువులకు గేట్లు బిగించాం
మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం
వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: నగరంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకూ వర్షాలకు సంబంధించిన పనుల్లో అందరూ నిమఘ్నమయ్యారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేయడం జరిగిందన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సవిూక్షిస్తున్నామన్నారు. కుంభవృష్టిగా వర్షం పడడం.. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతోందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమేనని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశామన్నారు. దీంతో పాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించామని, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారన్నారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందని కేటీఆర్ అన్నారు.గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గింది. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సవిూక్షిస్తున్నాం. మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాం. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తానని కేటీఆర్ పేర్కొన్నారు.