తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 7
ఆరుగాలం కష్టించి విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులను అన్ని విధాల దోపిడీ చేస్తున్న బహుళ జాతి విత్తన కంపెనీల దోపిడీని అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తనోత్పత్తి రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై సాగర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన ఉత్పత్తి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని,ఎలాంటి రక్షణ చట్టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు విత్తనాలను అందిస్తున్న రాష్ట్రం మనదేనన్నారు. ఇక్కడి వాతావరణం సమ శీతోష్ణస్థితి కారణంగా విత్తనాలను గత రెండు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారన్నారు. విత్తన రైతులకు పటిష్ట చట్టం లేకపోవడం వలన విత్తన కంపెనీల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. 1966 లో చేసిన చట్టమే నేటికీ అమలు అవుతుందని, ఆనాడు విదేశాల నుండి దిగుమతి కోసం చేసిన చట్టమని ఇప్పుడు మనం ఎగుమతి చేసే స్థాయికి వచ్చామని పటిష్ట రైతు రక్షణ చట్టం అవసరం అన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తనాలు వరి విత్తనాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే రైతులు ఉన్నారన్నారు.పంట నష్టపోయిన రైతులకు కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలన్నారు. జర్మనేషన్ టెస్ట్లు రైతుల ముందే చేయాలని డిమాండ్ చేశారు. లాభాలన్నీ కంపెనీలకు వెళితే నష్టాలు రైతులు అనుభవిస్తున్నారని తద్వారా విత్తనోత్పత్తి రైతులు ఆత్మహత్యలు కూడా ఈ కాలంలో బాగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న విత్తన కంపెనీలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉత్పత్తి ఒప్పందం కంపెనీ రైతులతో చేసుకున్నప్పుడు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ద్వారా డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీలు ప్రమోటర్లను నియమించుకొని వారిద్వారా రైతులతో విత్తన ఉత్పత్తి సాగిస్తున్నాయన్నారు. విత్తన ఉత్పత్తి భూమిలో పనిచేయడం వలన చర్మవ్యాధులు, క్యాన్సర్, గుండె జబ్బులు వస్తున్నాయని, రైతుల నుండి సేకరించే విత్తనాలకు న్యాయమైన ధర నిర్ణయించకుండా కంపెనీలు దోపిడీ చేస్తున్నాయన్నారు రైతు నుండి విత్తనం సేకరించిన తర్వాత మూడు మాసాలైన డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. గద్వాల జిల్లాలో 50వేల ఎకరాలలో నాణ్యతలేని ఆడ,మగ విత్తనాలు ఇవ్వడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారన్నారు. నాణ్యత లేని విత్తనాల మూలంగా ఏటా ఆరు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి అన్నారు. తద్వారా రైతులు పెట్టుబడిని సైతం నష్టపోతున్నారని, 2014 నుండి మార్చి 24 వరకు వేల కేసులను విజిలెన్స్ శాఖ పట్టుకుందన్నారు. అయినప్పటికీ అధికారుల అండదండలతో కల్తీ విత్తన వ్యాపారం కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్రాన్ని విత్తన గోదాముగా మారుస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తన ఉత్పత్తి అభివృద్ధికి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. విత్తన రైతుకు సాంకేతిక సలహాలు,వడ్డీ లేని రుణ సౌకర్యం కంపెనీలు కల్పించాలని డిమాండ్ చేశారు.పంట వేయడానికి ముందే విత్తన సేకరణ ధరను నిర్ణయించి అమలు చేయాలన్నారు.ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించాలన్నారు. విత్తన రైతులకు పంటల బీమా, రైతు బీమా ప్రీమియం కంపెనీలే చెల్లించాలన్నారు. విత్తన రైతులకు శాస్త్రవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. మార్కెట్ కమిటీల ద్వారా విత్తనోత్పత్తి రైతులకు సలహాలు, సూచనలు, విత్తన నిల్వ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విత్తన రైతులకు పెట్టుబడికి అనుగుణంగా బ్యాంకులో సహకార సంఘాలు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్కురి వాసుదేవ రెడ్డి, చల్లారపు తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు బాసిర సంపత్ రావు, గుండేటి వాసుదేవ్, సహాయ కార్యదర్శి శీలం అశోక్, జునూతుల జనార్దన్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు చేలుపూరి రాములు, కాయిత లింగారెడ్డి,రమాదేవి, పిట్టల తిరుపతి, దాసరి మొగిలి, యుగంధర్ రెడ్డి, భీమిరే రాజు, చంద్రమౌళి, నంద రాజయ్య, రజిత, లతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విత్తన రైతు ప్రతినిధులు హాజరైనారు.