జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 05 : ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సంరక్షణకు రైతులు యాజమాన్య పద్దతులు పాటించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగు నీటిని తీసివేయాలని,రాబోవు 2 రోజులలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలని తెలిపారు.వరి పంటలో ప్రస్తుతం దుబ్బు చేసే దశలో ఉందని,బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు 0.2 గ్రా॥ ప్లాంటమైసిన్ మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలని, కాండం కుళ్ళు రావడానికి అవకాశం ఉన్నందున 2.5 గ్రా॥ కార్బెండజిమ్, మ్యాంకోజేబ్ శీలీంద్రనాశక మందును/ఒక మి.లీ. మైసిన్ వాలిడామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు.అగ్గి తెగులు గమనించినట్లయితే 0.6 గ్రా॥ ట్రై సైక్లోజోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని,2వ దఫా యూరియాను వేసుకోవడానికి అనుకూలమైన సమయమని, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించి ఉన్నట్లయితే నత్రజని మోతాదుకు మించి ఉపయోగించకూడదని తెలిపారు.ప్రత్తి పంటలో వర్షాలు తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా,20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం.మీ. దూరంలో పాదులు తీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పాలని, ముంపుకు గురైన పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 ,13-0-45 / 10 గ్రా॥ యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలని,పిండి నల్లి రావడానికి అవకాశం ఉ న్నందున ఎసిఫేట్ 1.5 గ్రా॥ / 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు నివారించుటకు 3 గ్రా॥ కాపర్-ఆక్సి-క్లోరైడ్ / ఆల్టర్నేరియా,ఆకు మచ్చ తెగులు కొరకు 2.5 గ్రా|| కార్బెండజిమ్, మ్యాంకోజేబ్ శీలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలని తెలిపారు.
మొక్కజొన్న పంటలో నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలు ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుందని,ప్రస్తుతం పంట మోకాలు ఎత్తు నుండి జల్లు కట్టే దశ వరకు ఉన్నందున వర్షాలు నిలిచిన తర్వాత మోకాలు ఎత్తు దశలో ఉన్న పంటకు 5 గ్రా॥ 19-19-19 / 20గ్రా॥ డి.ఎ.పి. మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలని,వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వర్షాధార పంటకు పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా,15 కిలోల పోటాష్‌ను వేసుకోవాలని తెలిపారు. బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు నివారణ కొరకు బ్లీచింగ్ పౌడర్‌ను 5 కిలోలు వేసుకోవాలని, కత్తెర పురుగును కూడా గమనించుకుంటూ అవసరమైనట్లయితే 0.3 మి.లీ.క్లోరైంటిని పోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు.ప్రస్తుతం ఎడతెరపి లేని వర్షాల నేపథ్యంలో పంటల సంరక్షణకు రైతులు యాజమాన్య పద్దతులు పాటిస్తూ అధిగ దిగుబడి సాధించి లబ్ది పొందాలని తెలిపారు.