పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన శిక్షలు

-బెల్లంపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్సై నూనె శ్రీనివాస్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 8:

బడికి వెళ్లాల్సిన పిల్లలను పని పిల్లలుగా ఎవరైనా పెట్టుకుంటే వారికి కఠిన శిక్షలు తప్పవని బెల్లంపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్సై నూనె శ్రీనివాస్ హెచ్చరించారు. జనవరి 31 వరకు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆపరేషన్ స్మైల్ లో భాగంగా గురువారం మందమర్రి మార్కెట్ ఏరియాలోని దుకాణాలలో సిబ్బందితో కలిసి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణ సముదాయాలలో మైనర్ బాలలను పనిలో పెట్టుకోకూడదని, పసి పిల్లలతో పనులు చేపిస్తూ వ్యాపారాలు చేస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులలో భాగంగా పనులకు వెళ్తున్న పిల్లలను గుర్తించి పాఠశాలకు పంపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విద్యాలయాలకు దూరమై కూలి పనులకు వెళ్తున్న బాల బాలికలను గుర్తించి ఇద్దరిని తంగళ్ళపల్లి పాఠశాల, నలుగురిని రామకృష్ణాపూర్ పాఠశాలలో చేర్పించామన్నారు. ఎవరైనా స్కూలుకు వెళ్లకుండా పనికి వెళ్తే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking