జాతీయ విపత్తుగా ప్రకటించాలి
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 3
కేరళ రాష్ట్రం వయనాడులో సోమవారం అర్ధరాత్రి వర్షం చేసిన ప్రళయ నాదానికి ఊళ్ళకు ఊర్లు స్మశానాలు అయ్యాయని, కొండలు అమాంతం వచ్చి ఇళ్లను కబళించాయని వందలాదిమంది చనిపోయారని, ఈ విపత్తు నుండి క్షతగాత్రులను, ప్రజలను కాపాడాలని, బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రోజున కేరళ వరద బాధితుల సహాయార్థం జమ్మికుంటలో విరాళాల సేకరించి వాసుదేవా రెడ్డి మాట్లాడారు. జడివానకు ముంచెత్తిన వరదలకు తోడు కొండచారియలు విరిగిపడి కేరళ రాష్ట్రం వాయనాడుజిల్లా బిక్కుబిక్కుమంటూ వనిగిపోయిందని, ఇప్పటివరకు 300 మంది మరణించారని, అనేకమంది గల్లంతయ్యారని సహాయక చర్యలు అక్కడి ప్రభుత్వం ముమ్మరం చేసిందని గుర్తు చేశారు. 50 శిబిరాల్లో 10,000 మంది బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి విపత్తు సంభవించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతనుండి తప్పుకొని రాజకీయాలు మాట్లాడడం సరికాదు అన్నారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ప్రకృతి విలయం మాటలకందని మహా విషాదం అన్నారు. వందలాది మంది నిద్రలోనే సమాధి అయ్యారని, మరెందరో గల్లంతయ్యారన్నారు. వందల ఇల్లు పేక మేడల కూలిపోయాయన్నారు. శిథిలాల కింద ఉండి వినిపించే ఆర్తనాదాలు హృదయాన్ని మెలివేస్తూనే ఉంటాయన్నారు. మరు భూమిని తలపిస్తున్న వైనాడు గ్రామాల్లో సైన్యం బాధితులకు బాసటగా నిలిచిందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఉదారంగా సహాయం చేయాలని వాసుదేవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్, నాయకులు జక్కుల రమేష్, చెల్పూరి రాములు, జక్కుల రమేష్, వడ్లూరి కిషోర్, కన్నం సదానందం, సిరికొండ పోచయ్య, చల్ల సంపత్, ప్రశాంత్, రాజేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.