జర్నలిస్టులకు ట్రేడ్ యూనియన్ లపై అవగాహన అవసరం

టియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ

మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విలేకరుల సమస్యలపై లోతైన అధ్యయనం.

త్వరలో జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు

ఇళ్ల స్థలాల సమస్యలకు పరిష్కారం

అంగట్లో దొరుకుతున్న అక్రిడిటేషన్లను అరికట్టాల్సిన బాధ్యత మనదే.

ప్రజాబలం కూకట్ పల్లి,: జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, ట్రేడ్ యూనియన్ లపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ సూచించారు. మంగళవారం యూనియన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శాఖ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షతన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నేతృత్వంలో కూకట్ పల్లి లోని శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాద్యులను జర్నలిస్టులు సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరహత్ అలీని జర్నలిస్టులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో విలేకరుల సమస్యలు పరిష్కారానికి నోచుకోక అనేక ఇబ్బందుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తున్న కే.శ్రీనివాస్ రెడ్డికి ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవిని అప్పగించడం ఆశాజనకంగా ఉందన్నారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా విలేకరుల సమస్యలపై నిత్యం చర్చలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆరోగ్యకారులు లేకపోవడంతో, సరైన వైద్య సదుపాయాలు అందక పలువురు విలేకరులు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ త్వరలోనే హెల్త్ కార్డులను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హుడైన ప్రతి విలేఖరికి అక్రిడిటేషన్ అందాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లో విచ్చలవిడిగా ఎవరికి పడితే వారికి అక్రిడిటేషన్లు దొరకడం విచారకరమన్నారు. మార్కెట్లో అంగడి సరుకుగా మారిన అక్రిడిటేషన్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ మండల, జిల్లా కేంద్రాలుగా పరిగణలోకి తీసుకుంటూ ఇళ్ల స్థలాలను మంజూరు చేసే విధంగా యూనియన్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఓ సంఘం ప్రభుత్వం తమ జేబులో ఉందని చెప్పుకుంటూనే జర్నలిస్టులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ పాలాభిషేకాలు చేస్తూ లేనిపోని భ్రమలను కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘాలతో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

టియుడబ్ల్యూజె నూతన కమిటీ కి సన్మానం

టీయూడబ్ల్యూజే నూతన రాష్ట్ర కమిటీ లో గ్రేట్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్టు నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కోశాధికారిగా ఎన్నికైన మోతే వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, గౌస్ మొయినుద్దీన్, అనిల్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబా, ప్రధాన కార్యదర్శి అశోక్, హెచ్ యు జే అధ్యక్షులు శిగ శంకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్కయ్య, మామిడాల రవీందర్ రెడ్డి, సలీం పాషా, తొట్ల పరమేష్, మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అధ్యక్షత వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి కరీం, రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking