దేశంలో అతిపెద్ద అంజన్న గుడి ఖ్యాతి కొండగట్టుకే దక్కాలి

 

ఆ దిశగా మన పనులు నడవాలి

మరో ఐదువందల కోట్లు కేటాయింపు

_కొండగట్టుపై సమీక్ష సమావేశంలో
ముఖ్యమంత్రి కేసీఆర్_

జగిత్యాల, ఫిబ్రవరి 15,( ప్రజాబలం ప్రతినిధి)దేశంలోనే అతిపెద్ద ఆంజనేయస్వామి దేవస్థానం కొండగట్టులోనే ఉందన్న దిశలో ఆలయ నిర్మాణం జరగాలని అందుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. బుధవారం ఉదయం నిర్ణిత సమయానికి జే.ఎన్.టి.యు హెలిప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి వాహనంపై కొండగట్టుకు చేరుకున్నారు. అనంతరం కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ పరిసరాలను ఆనంద్ సాయి,అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఆలయ నిర్మాణం ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
దేవాలయాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాల పై లొకేషన్ మ్యాపుతో పూర్తిగా పరిశీలించిఅధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు.వైష్ణవ సాంప్రదాయాన్ని అనసరించి ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధిని చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. నిధులకు ఎలాంటి కొరత లేదనీ అవసరమైతే వెయ్యి కోట్ల రూపాయలైన కేటాయించేందుకు సిద్ధమని సీఎం చెప్పారు. యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాల మాదిరి అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను కూడా సచేపట్టాలని సీఎ కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గర్భాలయం మినహా మినహా ఆలయాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మూలవిరాట్టును ముట్టుకోకుండా ఆలయ విస్తరణ సాగాలని చెప్పారు. వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో ముందే నిర్ణయించుకోని ఎక్కడిదక్కడే పక్కాగా నిర్మాణం జరగాలని సూచించారు. ఏటా లక్షలాది మంది దీక్షాపరులు దీక్ష చేపడతారని వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేయాలని వీటి విషయంలో భవిష్యత్తు అవసరాలను గుర్తించి పనులను చేపట్టాలని సీఎం సూచించారు.
మంగళవారం, శని, ఆదివారాల్లో రద్దీ సమయాలతో పాటు, హనుమాన్ జయంతి, ఇతర పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడీని తట్టుకునేలా నిర్మానాలు జరగాలని సీఎం చెప్పారు. ప్రస్తుతం వస్తున్న భక్తులతో పాటు, ఆలయ అభివృద్ధి తర్వాత పెరగనున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని చెప్పారు. హనుమాన్ జయంతికి సగం భారతదేశం కొండగట్టు అంజన్న వైపు నడిచేలా నిర్మాణం ఉండాలన్నారు. కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండడట్టుకు తరలించి భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా నీటి వసతిని కల్పించాలని కల్పించాలని చెప్పారు.
విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖాన, బస్టాండు, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్ స్టేషన్, కళ్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలని సీఎం చెప్పారు. ఈ నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆనంద్ సాయికి సీఎం సూచించారు.ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందనీ, అప్పటిదాకా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని అధికారులకు సీఎం తెలిపారు.
గుట్టలపై నుంచి సహజంగా ప్రవహించే నీటి ప్రవాహం సంతులోని లొద్దిలో నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని సీఎం కోరారు. గుట్ట చుట్టూ ఉన్న చెరువుల గురించి ఇరిగేషన్ అధికారులతో సీఎం ఆరా తీశారు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొండగట్టులో నీటి బాధ తప్పిందని సీఎంకు అధికారులు వివరించడంతో సీఎం కొంత సంతృప్తిని వ్యక్తం చేశారు. గుట్ట మీద కాటేజీల నిర్మాణికి దాతలను ఆహ్వానించాలని సీఎం సూచించగా ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ నిర్మించిన కాటేజ్ విస్తరణలో పోతున్నందున దాన్ని తిరిగి నిర్మాస్తామని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. దానికి తగిన స్థలాన్ని కేటాయించాలని గంగుల కమలాకర్ కోరగా సీఎం గంగుల కమలాకర్ ను అభినందించారు. కళ్యాణ కట్ట దగ్గర పుష్కరిణిలు ఏర్పాటు చేయాలని, కళ్యాణ కట్ట పుష్కరిణి పక్కపక్కన ఉండటంతో పాటు స్త్రీలు, పురుషులకు ప్రత్యేక పుష్కరిణులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొండగట్టు అంజన్న అబయారణ్యం ప్రాంతం మైసూరు-ఊటి రహదారిలోని నీలగిరి కొండల్లోని బందీపూర్ అభయారణ్యం మాదిరి మార్చాలని అటవీశాఖ అధికారి భూపాల్ రెడ్డికి సీఎం సూచించారు. స్థల పురాణం పుస్తకాలను ముద్రించాలని, రాష్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణ పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని టూరిజం శాఖ ఎండి మనోహర్ రావును సీఎం ఆదేశించారు. ఆలయానికి వచ్చిన భక్తుల దర్శన విధానాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అదే పద్ధతిలో పునర్నిర్మాణాలను చేపట్టాలన్నారు. మొదటి మూలవిరాట్టును దర్శించుకన్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వేంకటేశ్వర స్వామిని, తర్వాత గుట్ట కింద భేతాళ స్వామి దర్శనం, రాములవారి పాదుకల దర్శనం సర్క్యూట్ ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సీఎం అధికారులకు కోరారు.
గుట్ట మీదకి వచ్చే వివిఐపిల కోసం యాదగిరిగుట్ట మాదిరి ప్రెసిడెన్షియల్ సూట్ , వివిఐపి సూట్ల నిర్మాణానాకి సంబంధించి స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తు నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలన్నారు.
రెండు నెలల్లో కొండగట్టు అంజన్న ఆలయానికి నీటి సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీటిని తరలించే పనులను తక్షణమే పనులు చేపట్టాలని సీఎం స్మితా సభర్వాల్ కు సీఎం సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలైతాయన్నారు.
అంజనాద్రి పేరుతో వేదపాఠశాలను నిర్మించాలనీ, అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.
రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆలయ పున్నర్మిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ మహా కార్యం పూర్తయ్యే వరకు తాను అనేక పర్యటనలు చేపట్టాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమాలకర్, ఎంపి దివకొండ దామోదర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సంజయ్, కె. విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మండలి చీఫ్ విప్ భాను ప్రసాద రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్షణ రావు, ఎఫ్ డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, డిసిసిబి ఛైర్మన్ అల్లోల శ్రీకాంత్ రెడ్డి , గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, ఆర్ అండ్ బి అధికారులు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఆలయ స్తపతి ఆనందర్ సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking