కెఎస్‌ఆర్‌ టుగెదర్మెంట్స్‌ ఫ్లాట్‌ యజమానులను బిల్డర్‌ మోసాల నుండి కాపాడండి

 

ఈ రోజు మీ ముందు కూర్చున్న వారమంతా మియాపూర్‌లోని కెఎస్‌ఆర్‌ టుగెదర్మెంట్స్‌ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్లు కొనుకుక్క వాళ్లమే. 2గెథర్మెంట్స్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ యజమాని టి. హరనాథరావు అనే బిల్డర్‌ లాండ్‌ లార్డ్స్‌తో కలిసి ఈ కాంప్లెక్స్ డెవలప్‌ చేశారు. ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గురించి బిల్డర్‌ చేసిన ప్రచారం, అత్యాధునిక వసతులతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్న హామీలను దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయలు పెట్టి ఈ వెంచర్‌లో ఇళ్లు కొనుక్కున్నాము. తీరా దశలవారీ పేమెంట్స్‌ పూర్తి చేసి రిజిష్ట్రేషన్‌ చేయించుకుని ఇంట్లోకి వెళ్లే సరికి బిల్డర్‌ చూపించిన రంగుల ప్రపంచానికి కళ్ల ముందు కనిపించే వాస్తవానికి పొంతన లేని పరిస్థితులు ఎదురయ్యాయి.

లే అవుట్‌ చుట్టూ హామీ ఇచ్చిన గ్రీన్‌ బెల్ట్‌ మొదలుకుని అపార్ట్‌మెంట్‌ భాగంలో ఏర్పాటు చేయాల్సిన టాట్‌లాట్‌ (పార్కు లాంటిది) కానీ పార్కింగ్‌ విషయంలో కానీ, ఫైర్‌ సేఫ్టీ విషయంలో కానీ బిల్డర్‌ అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారు. వివిధ విభాగాల నుండి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు పొందటానికి ఆయా ప్రభుత్వ విభాగాలకు సమర్పించిన బిల్డింగ్‌ ప్లాను ఒకరకంగా చూపించి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత దాన్ని మరో రకంగా మార్చేశారు.

ఉదాహరణకు ప్రతి ఫ్లాటుకు రెండేసి కారు పార్కింగ్‌లు ఇస్తామన్నది బిల్డర్‌ వాగ్దానం. మరి కొంత మందికి మూడు పార్కింగ్ స్లాట్స్ కూడా ఇస్తామని వాగ్దానం చేశారు. ఆ ప్రకారం ఒక్కొక్కరి దగ్గర ఎనిమిది లక్షలు అదనంగా కూడా వసూలు చేశారు. కానీ జి హెచ్ ఎమ్ సి అనుమతి ఇచ్చింది కేవలం 172 పార్కింగ్ స్లాట్లకు మాత్రమే. 172 పార్కింగ్ స్లాట్ల కు అనుమతి తీసుకుని 300 పార్కింగ్ స్లాట్స్ ఆఫర్ చేయటం మోసగించడం కాక ఏమవుతుంది ? విజ్ఞులు ఆలోచన చెయ్యాలి.

ఇది పూర్తిగా రెసిడెన్షియల్‌ అపార్ట్మెంట్ కాంప్లెక్సు అని కొనుగోలుదార్లను నమ్మించారు. కాంప్లెక్స్‌లో ఉండే కామన్‌ ఏరియాస్‌లకు కావల్సిన విద్యుత్‌ సరఫరా సోలార్‌ సెట్‌ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా కామన్‌ ఏరియాలకయ్యే విద్యుత్‌ ఛార్జీల భారం ప్లాటు యజమానులకు శాశ్వతంగా తగ్గిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చూసిన తర్వాత ఈ కాంప్లెక్సులో కోట్లు కుమ్మరించి ఫ్లాట్లు తీసుకున్నాము. కానీ ప్రతి ఒక్క ప్లాటు యజమానికీ సింగిల్‌ కార్‌ పార్కింగ్‌ మాత్రమే కేటాయించారు. అదేమిటి అని నిలదీయగా మీకిచ్చిన పార్కింగ్ స్లాట్ లో నే కారు మీద కారు పెట్టుకునే ఏర్పాటు చేస్తాను అని దబాయించారు.

కాంప్లెక్సు చుట్టూ ఉండాల్సిన గ్రీన్‌ బెల్ట్‌ స్థానంలో ప్లాస్టిక్‌ మ్యాట్‌ పరిచి ప్రభుత్వ అధికారులను మోసగించి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు పొందారు. ప్లాటు కొనుగోలు దార్లను ఆకర్షించటానికి కావాల్సిన సర్టిఫికెట్లు ప్రదర్శించారు.

చివరకు అగ్నిప్రమాద నివారణ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయకుండా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు తప్పుడు వివరాలు సమర్పించటం ద్వారా వాళ్లను తప్పుదారి పట్టించారు.

జిహెచ్‌ఎంసీకి సమర్పించిన డ్రాప్ట్‌ లే అవుట్‌లో పూర్తి రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ అని రాశారు. ఇపుడేమో అందులో కమర్షియల్‌ స్పేస్‌ కూడా ఉంది అని తప్పుడు రిజిష్ట్రేషన్లు చేస్తున్నారు. దీనిపై కెఎస్‌ఆర్‌ టుగెదర్మెంట్స్‌ ఫ్లాట్‌ యజమానుల మ్యాక్స్‌ సొసైటీ కేసులు పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చింది. ఆ ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టడానికి కదలాల్సి ఉంది. ఎప్పుడో నాలుగు ఐదు నెలలు క్రితం మమ్ములను మోసగించిన బిల్డర్‌ మరియు లాండ్‌ లార్డ్స్‌పై ఇచ్చిన ఫిర్యాదులపై ఇంకా ఎఫ్‌ ఐ ఆర్‌ రిజిష్టర్‌ చేయని పోలీసులు నెల రోజులు క్రితం బిల్డర్‌, ఆయన తాబేదారులు ఇచ్చిన తప్పుడు కంప్లైంట్స్‌ ఆధారం చేసుకుని ఫ్లాటు యజమానులపై ఎఫ్‌ఐఆర్‌లు రిజిష్టరు చేసి స్టేషనుకు తిప్పుతున్నారు.

బిల్డర్‌ తరపున సంఘ వ్యతిరేక శక్తులు ఎప్పుడెప్పుడూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి చెలరేగిపోతారో అని ఫ్లాటు యజమానులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది.

ఉదాహరణకు ది 21.12.2023న డెవలపర్‌ హర్నాధరావు కొంతమంది రైడీ మూకలను వెంటేసుకుని వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడితే వాళ్లపై చేయి చేసుకుని కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి కామన్‌ ఏరియాస్‌లో వీరంగం వేశారు. కామన్‌ ఏరియాస్‌లో ఉన్న నిర్మాణాలను పగలగొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. కానీ ఇంతవరకూ దానిపై కేసు నమోదు కాలేదు. వివిధ సందర్భాల్లో బిల్డర్‌ ఆగడాల మీద, కాంప్లెక్సులో కలిగిస్తున్న భయోత్పాత వాతావరణం మీద 14 ఫిర్యాదులు ఇచ్చాము. ఆఖరికి కమీషనర్ ను కూడా కలిసి మా గోడు విన్నవించుకున్నాము. కమీషనర్‌ దిగువ స్థాయి అధికారులకు విచారణ నిమిత్తం డైరెక్షన్స్‌ ఇచ్చినప్పటికీ మియాపూర్‌ స్టేషన్‌ అధికారులు ప్లాటు యజమానులపై తప్పుడు కేసులు నమోదు చేయటంలో చూపిస్తున్న ఆసక్తి ఫ్లాటు యజమానులను మోసగించిన బిల్డర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయటంలో చూపించటం లేదు. కారణాలు వారికి మాత్రమే తెలియాలి.

ఈ ప్రమాదాన్ని గుర్తించి ఏప్రిల్‌ ఒకటో తేదీన ఫ్లాటు యజమానులకు, బిల్డర్‌కు మధ్య ఉన్న సివిల్‌ వివాదంపై కూకట్పల్లి కోర్టులో దావా కూడా వేశాము. దానిపై విచారణ జరుగుతుండగానే బిల్డర్‌ రిజిష్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ని తప్పుదోవ పట్టించి కొన్ని తప్పుడు రిజిష్ట్రేషన్‌ డీడ్స్‌ సృష్టించి వాటి ఆధారంగా అదే ఆస్తిపై మరోరెండు సివిల్‌ దావాలు వేశారు. మేము ఇదే ఆస్తిపై దావా వేసిన తర్వాత తప్పుడు డాక్యుమెంట్లు ఆధారంగా కోర్టును ఆశ్రయించిన వారికి తాత్కాలిక ఆదేశాలు ఎలా ఇస్తారు అని మేము ఆరా తీయగా పోలీసు స్టేషన్లోనే మాకు మేము పెట్టుకున్న లాయర్లు జ్యుడిషియరీ కుటుంబాల నుండే వచ్చిన వాళ్లనీ, వాళ్లకు కోర్టు ఆదేశాలు తీసుకోవటం ఎలాగో ఫ్లాటు యజమానులకన్నా బాగానే తెలుసనని డెవలపర్ చెప్పారు.
ఇటువంటి పరిస్థితుల్లో తక్షణం జరిగే నష్ట నివారణ కోసం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా వేశాము.

జిహెచ్‌ఎంసీ ఇచ్చిన ప్లాన్‌ అప్రూవల్‌ ప్రకారం ఆ కాంప్లెక్సులో మొత్తం 150 యూనిట్ల నిర్మాణానికి, నూటయాభై డెబ్బై రెండు పార్కింగ్‌కు శ్లాట్లకు మాత్రమే అనుమతి ఉన్నది. ఆ ప్రకారంగానే హై రైజ్‌ అపార్ట్‌మెంట్స్‌లో జరుగుతున్న విధంగానే రెసిడెంట్స్‌ సౌకర్యార్ధం కన్వీనియన్స్‌ షాపులకు ప్రొవిజన్‌ ఇవ్వటం జరిగింది. కానీ అన్ని అనుమతులూ వచ్చిన తర్వాత బిల్డింగ్‌ సేఫ్టీ ప్రమాణాలు గాలికి వదిలి ఈ కన్వీనియన్స్‌ షాపులు పూర్తి స్థాయి వాణిజ్య సముదాయం అని వాటిని అమ్మటానికి బిల్డర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక షాపును నాలుగు ముక్కలు చేసి తప్పుడు రిజిష్ట్రేషన్‌ చేశారు. అదికూడా అదే ఆస్తి మీద సివిల్‌ దావాలు నడుస్తున్నప్పుడు రిజిష్ట్రేషన్‌ చేయటం అటు ఫ్లాటు యజమానులతో పాటు కొనుగోలుదార్లను కూడా మోసగించటమే.

ఆ షాపుల రిజిష్ట్రేషన్‌ పత్రాల్లో కూడా కమర్షియల్‌ షాపులు రిజిష్టర్‌ చేస్తున్నట్లు రాసుకున్నా పేమెంట్‌ షెడ్యూల్‌ వివరణ లో కొటక్‌ మహీంద్ర బ్యాంకుకు మాత్రం ఇళ్లు కొంటున్నామని హోం లోన్‌ తీసుకున్నట్లు ఆ సొమ్ము బిల్డర్‌కు చెల్లించినట్లు రాశారు. ఈ విధంగా కెయస్‌ఆర్‌ టుగెదర్మెంట్స్‌ బిల్డర్‌ వ్యవహారం అడుగడుగునా మోసంతో నిండిపోయింది.

ఈ కుట్రలు, కుయుక్తులు, మోసాలు తెలీని మధ్యతరగతి ఉద్యోగలు బిల్డర్‌ హర్నాధరావు చూపించిన త్రిశంఖు స్వర్గాన్ని చూసి నమ్మి కోట్లు వెచ్చించి ఫ్లాట్లు కొనుక్కుని ఇప్పుడు ఇలా న్యాయం కోసం వీధి పోరాటాలు చేయాల్సి వస్తోంది.

బిల్డర్‌ చేసిన మోసాల్లో అన్నిటి కన్నా పెద్ద మోసం ఆర్థిక నేరానికి పాల్పడటం. బ్యాంకింగ్‌ సంస్థలను మోసం చేయటం. ఈ కాంప్లెక్సులో ఉన్న 150 ఇళ్లల్లో అత్యధిక భాగం అమ్ముడు పోయాయి. అవి బిల్డర్‌ వాటాలోనూ అమ్ముడయ్యాయి. లాండ్‌ లార్డ్స్‌ వాటాలోనూ అమ్ముడు పోయాయి. ప్రతి ఫ్లాటు సేల్‌ డీడ్‌లోనూ ఆయా ఫ్లాట్ల విస్తీర్ణం ప్రకారం దామాషా ప్రాతిపదికన అన్‌ డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ లాండ్‌ కూడా అమ్మేశారు.
కానీ విచిత్రం ఏమిటంటే ప్రాజెక్టు ముగిసిన తర్వాత ఫ్లాట్లు యజమానులకు అరకొర సౌకర్యాలతోనైనా అంద చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందిన తర్వాత ఫ్లాటు యజమానులకు అమ్మేసిన అన్‌డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ లాండ్‌ను కూడా బిల్డర్‌ బ్యాంకుకు తనఖా పెట్టి మరో అరవైకోట్లు రుణం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటి వరకూ ఫ్లాటు యజమానులకు చెప్పకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు.

డెవలపరుగా ఆయనకు డెవలప్మెంట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం వచ్చిన వాటాపైనే హక్కు అధికారం ఉంటాయి. అది కూడా ఆయన వాటాకు వచ్చిన ఫ్లాట్లు అమ్ముకోకుండా ఉంటేనే వాటిపైనా, వాటితోపాటు వచ్చే అన్‌ డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ లాండ్‌ పైనా ఆయనకు హక్కులుంటాయి. ఒకసారి ఫ్లాట్లు, వాటితోపాటు వచ్చే అన్‌ డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ లాండ్‌ అమ్మేసిన తర్వాత దానిపై ఆయనకు ఎటువంటి హక్కు అధికారం ఉండదు. అలాంటిది మొత్తం సైటూ తనదేనని బ్యాంకింగ్‌ సంస్థలకు తప్పుడు కాగితాలు సమర్పించి, ఫ్లాట్ల అమ్మకాలు కొనగోళ్లు గురించిన వివరాలు దాచిపెట్టి భారీ ఆర్థిక నేరానికి బిల్డర్‌ తెరతీశారు. ఈ విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకువచ్చినా ఇప్పటి వరకూ స్పందించకపోవటం అనేక అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తోంది.

నిబంధనల ప్రకారం జిహెచ్‌ఎంసీ కి తనఖా పెట్టిన స్థలాన్ని, ప్రాపర్టీ వాటాను కూడా సుందరం ఫైనాన్స్‌ వారికి కుదువ పెట్టేయటం వెనక బిల్డర్‌తో పాటు అటు బ్యాంకింగ్‌ అధికారులు, జిహెచ్‌ఎంసీ అధికారుల మధ్య ఎటువంటి ఒప్పందాలు, లావాదేవీలు జరిగాయన్న అనుమానం అపార్ట్మెంట్ యజమానులను పీడిస్తోంది.

ఈ లోను విషయంలో సుందరం ఫైనాన్స్‌ వారిని సంప్రదించగా మొత్తం అరవైకోట్లు వడ్డీతో సహా చెల్లించిన తర్వాత మాత్రమే తనఖా పత్రాలు విడుదల చేస్తామని చెప్పారు.

ఇవన్నీ కలిసి చూస్తే కెయస్‌ఆర్‌ టుగెదర్మెంట్స్‌ బిల్డర్‌ పలువురు ఉన్నత స్థాయి అధికారులు, బ్యాంకింగ్‌ వ్యవస్థతో చేతులు కలిసి షుమారు రెండువందల యాభై కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ కుంభకోణం పైనా, అపార్ట్మెంట్ యజమానుల పై బిల్డర్‌ పదే పదే చేస్తున్న దాడులుపైనా కేసులు నమోదు చేసి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మధ్యతరగతి కష్టార్జితంతో అపార్ట్మెంట్ లో ఇళ్లు కొనుక్కున్న యజమానులకు రక్షణ కల్పించాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.

Leave A Reply

Your email address will not be published.

Breaking